ఒక్కోసారి చిన్నపాటి పొరపాట్లు… పెద్ద డ్యామేజీ చేస్తుంటాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇలానే ఉంది. విపక్ష నేత చంద్రబాబు అరెస్టు మీద మాట్లాడేందుకు ముందుగా.. ఆయన కచ్ఛితంగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎలా మాట్లాడితే బాగుంటుందన్న విషయాన్ని సలహాదారుల సూచనల్ని తీసుకొని ఉంటారు. ఇదంతా జరగకుండా జగన్ నోటి నుంచి మాట వచ్చే ఛాన్సు లేదు. మరి.. ఎవరి లోపమో.. మరెవరి ప్లానింగ్ లో జరిగిన తేడానో కానీ.. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఎంపిక చేసుకున్న టైమింగ్ ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదన్న మాట చెప్పే తీరులో జగన్ తేడా కొట్టేసిందని చెబుతున్నారు. అవునన్నా.. కాదన్నా చంద్రబాబు అరెస్టుపై మెజారిటీ ప్రజలు అంతో ఇంతో అయ్యో పాపం అనే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు అరెస్టును సమర్థించే వారు సైతం.. రెండు వారాలు దాటేసి.. మూడో వారం ముగిసిపోతున్న వేళ.. ఇప్పటికి బెయిల్ రాకపోవటం.. సమీప భవిష్యత్తులో వచ్చే పరిస్థితులు కనిపించని వేళ.. ఆయనపై సహజసిద్ధంగా ఒకలాంటి సానుభూతి వ్యక్తమవుతుంటుంది.
ఇలాంటివేళ.. సీఎం జగన్ నోటి నుంచి వచ్చే మాటలు అత్యంత అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ.. అందుకు భిన్నంగా యదాలాపంగా అన్నట్లు.. తనకేం సంబంధం లేనట్లుగా జగన్ నోటి నుంచి వచ్చిన మాటలు.. అతికేలా లేకపోవటమే కాదు.. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదన్న మాటలు అస్సలు సూట్ కాలేదంటున్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్టు జరిగిందని ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్లో ఎటకారమే తప్పించి.. తనకు సంబంధం లేదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాయి.
తాను విదేశాల్లో ఉండి కూడా చంద్రబాబును అరెస్టు చేయించే విషయంలో విజయవంతం అయ్యానన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు మీద తొలిసారి స్పందించే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని.. అలాంటిదేమీ లేకుండా తనకు తోచినట్లుగా జగన్ మాటలు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ మాటలే కాదు.. ఆయన మాట్లాడిన టైం కూడా బాగోలేదంటున్నారు. ముందస్తు బెయిల్ కు సంబంధించిన మూడు పిటిషన్లను ఏపీ హైకోర్టు రిజెక్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలో జగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలే కాదు.. టైమింగ్ కూడా ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.