మహాత్మాగాంధీపై రాష్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సీఎం జగన్‌కు ఆత్మీయ స్నేహితుడు విక్టర్ ప్రసాద్ చేసిన వాఖ్యలపై రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నాయకులు విక్టర్ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతోపాటు వైశ్య సామాజిక వర్గం నుంచి కొందరు నాయకులు ధర్నాలకు కూడా.. పిలుపునిచ్చారు. అదేసమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. దీనికి ఏమంటారు? అని ఆయనను ముగ్గులోకి లాగుతున్నారు. దీంతో విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇది సీఎం జగన్ మెడకు కూడా.. చుట్టుకుంటుండడం గమనార్హం.
ఏం జరిగింది?
‘గాంధీని మీరంతా మహాత్ముడని అంటే.. నేను దుర్మార్గుడు, నీచుడు అంటాను’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం రాజులపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘దేశంలో ఓటుహక్కు ఎవరికి ఇవ్వాలనే విషయమై 1932లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు గాంధీ అనే దుర్మార్గుడు.. ఈ దేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులతోపాటు ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఓటుహక్కు అసలు వద్దన్నారు. ఆడవారు ఏ కులంలో పుట్టినా వారికి ఓటు హక్కు, విద్య వద్దన్నారు. వారు ఉద్యోగం చేయడానికీ పనికిరారన్నారు. మహిళలకు ఆస్తిహక్కు వద్దన్నారు. అసలు బయటకు రావడానికే వీల్లేదన్నారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగు చూసినా భోగిమంటల మాదిరి గా సెగ పెడుతున్నాయి.
సంఘాల ఫైర్
మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఆర్యవైశ్య సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలో దుకాణాలను మూసేశారు. అనంతరం గాంధీబొమ్మ కూడలికి చేరుకుని మహాత్ముని విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆకివీడు శాఖ అధ్యక్షుడు పులవర్తి లక్ష్మణబాబా, మండల అధ్యక్షుడు సన్నిధి రామ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రి మేరుగ రియాక్షన్
వివాదం పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. విక్టర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడాలని అభిప్రాయపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆయన మాటల్ని ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఖండిస్తున్నామని నాగార్జున స్ఫష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని మంత్రి అన్నారు. ఆయన జవాబుదారీతనంగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి పేర్కొన్నారు. ఆయన మాటల్ని ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు.