ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు భయపడి ఆల్రెడీ ఉన్న అమరరాజా వంటి సంస్థలు కూడా ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అంటూ జగన్ ప్రభుత్వం కొత్త వ్యాపారానికి తెరతీసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
గత కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు ప్రభుత్వం విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించిందని, దుకాణం మూసే ముందు క్లియరెన్స్ సేల్స్ మాదిరి తన ప్రభుత్వం గడువు ముగిసే ముందు జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారని, 2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తామని వెల్లడించారని నాదెండ్ల గుర్తు చేశారు. అయితే, ఏం జరిగిందో తెలీదని, అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
ఏం క్విడ్ ప్రో కో జరిగిందని భూములు తిరిగి ఇచ్చారని ప్రశ్నించారు.
గతంలో యోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటుకు 300 ఎకరాల భూమిని వైఎస్ఆర్ కేటాయించారని, కానీ, ఆ భూములు తిరిగివ్వాలని జగన్ వెంటపడుతున్నారని ఆరోపించారు. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు ఇస్తామని జగన్ చెబుతున్నారని, అలా ఉంటే ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, జగన్ అవేవీ పట్టించుకోకుండా భూములను కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని జగన్ చెబుతున్న జగన్ ఏనాడూ పరిశ్రమల ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. పెట్టుబడులను వైఎస్సార్ ప్రొత్సహించారని, కానీ, జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.