అదేంటి.. అనుకుంటున్నారా? ఔను. ఇదినిజం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా.. నేను నిజాయితీ పరుడిని.. నేను ఏ తప్పూ చేయలేదు. ఏం చేసినా..నియమ నిబంధనల మేరకే చేశాను.. అని చెప్పుకొంటారు. అంతేకాదు.. తన మంత్రి వర్గంలోని వారు కూడా తనకు తెలిసి ఎవరూ తప్పులు చేయలేదని చెప్పేవారు. అయితే.. దీనిని టీడీపీ అభిమానులు.. లేదా ఒక వర్గం ప్రజలు బాగానే విశ్వసించేవారు. కానీ, ఎటొచ్చీ.. వైసీపీ నేతలు.ముఖ్యంగా సీఎం జగన్ మాత్రం విశ్వసించేవారు కాదు.
అందుకే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు పాలనాతీరుపై ఒక పుస్తకాన్ని వేశారు. పోలవరంలో ఇంత తినేశా రు.. అమరావతిలో ఇంత మెక్కేశారు.. రోడ్లు, ఇతర ప్రాజెక్టుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు.. అంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలతో పుస్తకాలు వేశారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు పదే పదే సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. తాము నిజాయితీగా పనిచేశామని.. ఏ విషయంలోనూ కక్కుర్తి పడలేదని చెప్పారు. అంతేకాదు.. వైసీపీ చేసిన ఆరోపణలు నిజమైతే.. వెంటనే నిరూపించాలని.. కూడా సవాల్ రువ్వారు.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారు.. అనేక విచారణ కమిటీలు వేసింది. పోలవరం నుంచి అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వరకు అనేక రూపాల్లో విచారణ చేయించింది. కానీ, ఏ ఒక్క దానిలోనూ తప్పును చూపించలేక పోయారు. ఇక, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులు వెళ్లాయి. అయినప్పటికీ..ఎక్కడా నిరూపించలేక పోయారు. దీంతో సుప్రీంకోర్టులోనూ.. చంద్రబాబు వైట్ కాలర్ తోనే బయటకు వచ్చారు. ఇక, పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను కొనుగోలు చేసి వైసీపీ నేతల ఫోన్లుట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా చేశారు.
వీటిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఇది కూడా ఏమీ తేల్చలేక పోయింది. అంటే.. మొత్తంగా చంద్రబాబుపైనా.. ఆయన కుమారుడు.. నారా లోకేష్‌పైనా.. ఇతర మంత్రులపైనా జగన్ అండ్ కో ఈ మూడున్నరేళ్ల లో ఇప్పటి వరకు ఏమీ నిరూపించలేక పోయిదనేది వాస్తవం. అంటే .. ఒక రకంగా.. చంద్రబాబుకు జగన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టే కదా! ఇక, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. త్వరలోనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించడం. తద్వారా ఎన్నికల్లో వైసీపీని ప్రభావితం చేయాలని నిర్ణయించడం. ఇదీ.. సంగతి!!