వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీని విమర్శించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గీత దాటి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు ఆయన దిగనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటేరియెట్ కార్యదర్శికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రారంభంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గరు ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు.. టీడీపీకి అనుకూలంగా ఓటేశారని వైసీపీ భావిస్తోంది.
అదేవిధంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని నమ్ముతోంది. ఈ క్రమంలోనే వారిని అప్పట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో వారు కూడా బయటకు వచ్చేసి.. ఇటీవల టీడీపీకి అనుకూలంగా మారారు. వీరిలో మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలు ప్రత్యక్షంగా టీడీపీలో చేరారు. ఇక, కోటంరెడ్డి, ఆనంలు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారు. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా వీరు సిద్ధమవుతున్నారు. వీరికి ఇప్పటికే సీట్లు కూడా ఖరారైనట్టు వారి అనుచరులు చెబుతున్నారు.
ఇలాంటి కీలకసమయంలో సీఎం జగన్ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు అసెంబ్లీని ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద.. వీరిపై అనర్హత వేటు వేయాలని తమ దరఖాస్తులో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు విన్నవించారు. దీనిపై చర్యలు తీసుకుని.. సాధ్యమైనంత వేగంగా వేటు వేయాలని కోరారు. ఇక, ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో ఓటాన్ అకౌంట్ కోసం అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో తొలుత ఈ విషయంపైనే అసెంబ్లీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అనర్హత తీర్మానంపై ఓటింగ్ పెట్టి.. సభలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. తీర్మానం ఆమోదం పొందిన నాటి నుంచి ఆరేళ్లపాటు ఆయా సభ్యులపై అనర్హత అమల్లోకి వస్తుంది. ఫలితంగా వచ్చే ఆరేళ్లపాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులవుతారు.
అయితే.. గత ఎన్నికల తర్వాత.. టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు దక్షిణ ఎమ్మెల్యే గిరి ధర్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి వీరిపై కూడా టీడీపీ అనర్హత తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. సంఖ్యా బలం లేనందున.. ఆ తీర్మానం వీగి పోయే పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు.