పోలవరం….రాష్ట్రానికి జీవనాడి వంటి జాతీయ ప్రాజెక్టు. అయితే, పోలవరం వైఎస్ కల అని..తండ్రి మొదలుబెట్టిన ఈ మెగా ప్రాజెక్టును తనయుడు జగన్ పూర్తి చేస్తాడని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు 60 శాతానికి పైగా పూర్తయినా సరే…ఆ క్రెడిట్ ను కూడా వైఎస్ఆర్, జగన్ ల ఖాతాలో వేసి ఆనందిస్తుంటారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే అసలు పోలవరం కల కన్నదెవరు అన్నదానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొట్టమొదటగా పోలవరం కలగన్నది మద్రాసు ప్రెసిడెన్సీ బహద్దూర్ దివాన్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్ అని చరిత్ర చెబుతోంది. వైఎస్ ఆర్ పుట్టింది 1949లో అని, అంతకంటే 8 ఏళ్లకు ముందే 1941లో పోలవరం ప్రాజెక్టుకు వెంకట కృష్ణ ప్రపోజ్ చేశారని వెల్లడైంది. ఆ తర్వాత 1980లో పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య శంకుస్థాపన చేశారని ఆధారాలతో సహా బట్టబయలైంది.
దీపావళి పండగనాడు నాగపూర్ లో నితిన్ గడ్కరీని, అంతకు ముందు ఉమా భారతి వంటి ఎందరో నాయకుల దగ్గరకు చెప్పులరిగేలా తిరిగి కేవలం కోటి రూపాయలు నిధులిచ్చినా సర్దుకొని వచ్చిన ఘనత నాయుడు ధర్మాన అనే వ్యక్తిదని చెబుతున్నారు. పోలవరం కోసం కూలీలా కష్టపడిన అటువంటి వారి వల్లే ఇవ్వాళ తెలుగు, భరత జాతి ఎనిమిది దశాబ్దాల కల 70% పూర్తయ్యి, కళ్లకు కనిపించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైఎస్ ఆర్, వైఎస్ జగన్ పై విమర్శలు వస్తున్నాయి.
పోలవరం వైఎస్ స్వప్నం కాదని, ఆ రోజుల్లో కనీసం పునరావాసానికయ్యే డబ్బులు రూపాయి ఇవ్వని ఘనత వైఎస్ దని, పోలవరానికి శాపంలా ఆనాడు మట్టి పనులుతో దోపిడీ యజ్ఞం చేసింది వైఎస్ అని నెటిజన్లు విమర్శల గుప్పిస్తున్నారు. ఏడాదిలో పోలవరం నుంచి నీళ్లు అందిస్తామని నీటి మాటలు చెప్పడం, ప్రచారం, దోపిడీ తప్ప జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు. పోలవరం నిర్మాణానికి సకాలంలో ఇసుకను సమకూర్చలేని చేతగాని చరిత్ర జగన్ దని, అందుకుగాను సముద్ర తీరాన ఇసుకతో జగన్ చిత్రాన్ని, వైఎస్ కు మట్టితో ఒక చిత్రాన్ని కట్టించి ఫోటోలు తీయాలని విమర్శిస్తున్నారు.