ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తన ఆస్తులు.. అప్పులతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులు.. అప్పుల వివరాల్ని వెల్లడించారు. ఈ నెల 25న (గురువారం) పులివెందులలో తన ఎన్నికల నామినేషన్ రెండో సెట్ ను ఎన్నికల అధికారులకు సమర్పించనున్న సంగతి తెలిసిందే. సోమవారం.. తన నామినేషన్ పత్రాల్ని తన తరఫు ప్రతినిధుల చేత ఎన్నికల అధికారులకు మొదటి సెట్ రూపంలో సమర్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల సెట్ లోని అంశాల్ని చూస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు మీద మార్కెట్ విలువ ఆధారంగా రూ.46.78 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా.. జగన్ సతీమణి భారతి పేరు మీద రూ.56.92 కోట్ల ఆస్తులు.. ఇద్దరు కుమార్తెల మీద చెరో రూ.1.63 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
స్థిరాస్తులతో పాటు వివిధ కంపెనీల్లో షేర్లతో సహా అన్ని రకాల చరాస్తుల్ని లెక్కలోకి తీసుకుంటే..జగన్ ఫ్యామిలీ ఆస్తులు మొత్తంగా రూ.650.66 కోట్లుగా తేలాయి. అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు మీద రూ.24.26 కోట్లు.. వర్షా రెడ్డి పేరు మీద రూ.23.94 కోట్లు చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సీఎం జగన్ సతీమణి భారతి వ్యక్తిగత ఆదాయం రూ.10.96 కోట్లుగా వెల్లడించారు.
ఇతరులకు ఆమె ఇచ్చిన అప్పులు రూ.30.91 లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.1.57 కోట్ల ఆదాయ పన్ను చెల్లించిన భారతి.. అడ్వాన్సు ట్యాక్స్ రూపంలో రూ.2.48కోట్లు చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు.. అప్పులు మొత్తం కలిపి రూ.7.41 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం రూ.57.74 కోట్లు కాగా.. ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.179.74 కోట్ల వరకు ఉన్నాయి.
గత ఏడాది రూ.4.66 కోట్ల ఆదాయపన్ను చెల్లించిన జగన్మోహన్ రెడ్డి.. అడ్వాన్సు ట్యాక్సు రూపంలో రూ.13.95 కోట్లు చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు.. అప్పులు మొత్తం రూ.1.1కోట్లుగా పేర్కొన్నారు. తనకు.. తన కుటుంబానికి ఉన్న ఆస్తులు.. అప్పులతో పాటు సంపాదన వివరాల్ని వెల్లడించిన జగన్.. తన మీద మొత్తం 26 కేసులు విచారణలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.