సీఎం జగన్ అప్పు ల వ్యవహారంపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం చంద్రబాబు నిర్మించిన 3.13లక్షల ఇళ్లను జగన్ రెడ్డి బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పు తెచ్చారని, ఆయన సిగ్గుమాలినతనానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. పేదలకే తెలియకుండా 10 వేల కోట్ల రుణం తెచ్చిన ఘనుడు జగన్ అని, లబ్ధిదారులను బ్యాంకులు మొండిపద్దులుగా పరిగణించడంతో ఈ వ్యవహారం బట్టబయలైందని అన్నారు.
టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు పంచినట్లు నాటకాలాడారని, జగన్ ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు కొట్టేసిందని విమర్శించారు. రుణం పొందడం కోసం లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని. వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని బ్యాంకులకు చెప్పి జగన్ ప్రభుత్వం రుణాలు పొందిందని చెప్పారు. అప్పు తీసుకొని రెండేళ్లయినా నిర్మాణ పనులు పూర్తిచేయలేదని చెప్పారు. దీంతో, లబ్ధిదారులకే బ్యాంకులు నోటీసులు పంపాయని, మరే బ్యాంకులోనూ వారికి రుణం రాకుండా ఎన్పీఏ (నాన్ పెర్ఫ్మారెన్స్ అకౌంట్స్) జాబితాలో చేర్చాయని తెలిపారు.
బ్యాంకుల నుంచి ఒత్తిడి, ఇళ్లు వేలం వేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పేదలను తిరిగి రెగ్యులర్ స్టేటస్ లో పెట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. జగనన్న కాలనీల నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని, టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.