ఏపీలో ప్రభుత్వం ఏర్పడడానికి.. వైసీపీ నిలబడడానికి.. కారణం ఎవరు అంటే.. ఏమాత్రం తడుముకో కుండా.. వైసీపీ నాయకులు చెప్పేమాట.. వైఎస్ కుటుంబం అనే! ఈ కుటుంబంలోని వైఎస్ షర్మిల, విజయమ్మలు.. 2019 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ఊరూ వాడా తిరిగారు. ఒక్కఛాన్స్ ఇవ్వాలంటూ.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ..వారు అభ్యర్థించారు. ఇంత గా.. పార్టీని అధికారంలోకి తీసుకురావ డంలో ప్రధాన భూమిక పోషించారు.
అయితే.. ఇప్పుడు అదే షర్మిల, విజయమ్మలు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు. పోలీసులపై చేయి చేసుకున్నారన్న అభియోగంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం.. ఆమెను కోర్టుకు హాజరు పరచడం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. దీంతో గతంలో జగన్ ఉన్న చంచల్‌గూడ జైలుకే యాదృచ్ఛికంగా షర్మిలను కూడా తరలించారు.
ఇక, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ రోజు లేదా రేపు.. విజయమ్మపై కూడా పోలీసులు కేసు పెట్టాలని నిర్ణయించారు. షర్మిలను చూసేందుకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన విజయమ్మను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తనను తాకరాని చోట తాకారంటూ ఓ మహిళా పోలీసుపై విజయమ్మ కూడా చేయిచేసుకున్నారనేది పోలీసులు చెబుతున్న మాట. రాత్రి ఆమెను వదిలేసినా.. ప్రబుత్వ ఆదేశాల మేరకు విజయమ్మపై కూడా కేసు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఇదే జరిగితే..విజయమ్మ అరెస్టు కూడా ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్నా.. తాడేపల్లి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంపై వైఎస్ అభిమానుల్లోనూ.. ముఖ్యంగా షర్మిల విజయమ్మల అభిమానుల్లోనూ చర్చగా మారింది. కేవలం వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలోనే జగన్స్పందించడం.. సొంత తల్లి, చెల్లిని వారి మానాన వారిని వదిలేయడం.. రాజకీయంగా ఆయనకు ఇబ్బందేనని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.