జనం తనను ఘోరంగా ఓడించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాతీర్పును అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆయన.. ప్రజలపై ఉన్న కోపాన్ని అసెంబ్లీపై చూపుతున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తారట.. లేదంటే రారట.. మీడియాతోనే మాట్లాడతారట! 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీకి వచ్చింది కేవలం 11 సీట్లే. సభ సంప్రదాయాల ప్రకారం.. మొత్తం స్థానాల్లో పదో వంతు వస్తేనే.. అంటే 18 సీట్లు వస్తేనే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లభిస్తాయి.
ఇది తెలిసినా.. తనకు హోదా ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాసి నవ్వులపాలయ్యారు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. అడ్డగోలు వాదన చేశారు. ‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తే.. ముఖ్యమంత్రి ఎంత సమయం మాట్లాడితే.. అంతే సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేతగా నేను చేయి ఎత్తితే వెంటనే స్పీకర్ మైక్ ఇవ్వాలి. అందుకే.. నాకు హోదా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో విడుదల చేసిన శ్వేత పత్రాలకు దీటుగా సమాధానం చెప్పేవాడిని. కానీ నాకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదు. అందుకే.. తాడేపల్లి నివాసంలో జర్నలిస్టులతో మాట్లాడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని ఆక్రోశించారు. రాజకీయ హత్యల నుంచి దృష్టి మళ్లించడానికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని హైలెట్ చేస్తున్నారు’ అని జగన్ పేర్కొన్నారు. కాలిబుగ్గయిన ఫైళ్ల గురించి మాత్రం నోరెత్తలేదు. ఫైళ్ల దహనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన ఎంపీ మిఽథునరెడ్డి మంచోళ్లని కితాబిచ్చారు. అందుకే.. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారట!
విపక్షంలోకి రాగానే ‘అరాచక’ మాటలు
‘రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది. రివర్స్ పాలన నడుస్తోంది. బాధితులపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు’… కొన్నాళ్లుగా జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్న మాటలివి! ‘ఔను.. ఆయన చెబుతున్నవన్నీ నిజాలే! అయితే… నాలుగు నెలల కిందటి వరకు పరిస్థితి ఇలాగే ఉండేది. ఆ విషయాలనే జగన్ ఇప్పుడు చెబుతున్నట్లుంది’ అని విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, రాష్ట్రపతి పాలన విధించాలి, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది’… అంటూ విపక్షంలోకి వచ్చిన రోజు నుంచే జగన్ వాపోతున్నారు.
తన ఐదేళ్ల పాలన గురించే జగన్ ఈ మాటలు అంటున్నట్లుందని.. ఆయన వ్యాఖ్యలు వింటుంటే నాటి పరిస్థితులు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయని జగన్ బాధితులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగన్ రచ్చ చేస్తున్నారు. కానీ వారెవరో, వారి పేర్లేంటో మాత్రం చెప్పడం లేదు. చంద్రబాబు తనను కొలంబియా డాన్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చడంపై విలేకరులు ప్రశ్నిస్తే.. జగన అర్థం కానట్లుగా ముఖంపెట్టారు. ఆ పేరును పలికేందుకు తడబడ్డారు.
కమెడియన్ స్టైల్!
‘దొంగతనం చేశాడనుకుందాం.. అయితే ఆ మాత్రానికి ఉరి శిక్ష వేసేస్తారా? దోపిడీలు, హత్యలు చేశాడు.. అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’… అదేదో సినిమాలో కమెడియన్ లాయర్ తన క్లయింటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు. ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా తమ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డంగా ఇరికించి తానూ ఇరుక్కున్నాడు. ‘పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టలేదు. ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు. అయినా… లోకేశ్ పోస్టు చేసిన వీడియోపై ఎలా చర్యలు తీసుకుంటారు..’ అని వైసీపీ నేతలు, లాయర్లు కోర్టుల్లో వాదిస్తుంటే.. జగన్ మాత్రం ‘అవును. ఈవీఎంను పిన్నెల్లే పగలగొట్టారు’ అని ధ్రువీకరించారు.
‘అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతున్న వారి పక్షాన నిలబడి ఉన్నానని చెప్పడం కోసం లోపలికిపోయి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి బాగుంటే ఎందుకు పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా… అన్యాయం జరుగుతోందని తెలిసే కదా ఈవీఎం పగలగొట్టాడు’ అని పిన్నెల్లిని ఫిక్స్ చేశారు. ఇది జూలై 4న జరిగింది. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్.. పిన్నెల్లిని పోలీసులు అరెస్టుచేసి నెల్లూరు జైలుకు తరలించడంతో.. అక్కడి నుంచి హుటాహుటిన తాడేపల్లి వచ్చారు. నెల్లూరు వెళ్లి ఆయన్ను పరామర్శించి మీడియా ఎదుట పై వ్యాఖ్యలు చేశారు. అది చూసి ఆయన పక్కన నిలబడిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అనిల్‌కుమార్ యాదవ్‌కు నోటి వెంట మాటరాలేదు. తమ నేత తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో బోధపడక.. జుట్టు పీక్కున్నారు.
సూక్తిముక్తావళి…
నెల్లూరు కారాగారం ముందు జగన్ చాలాచాలా నీతులు, సూక్తులూ వల్లెవేశారు. ‘ముఖ్యమంత్రిగా నేను ఏమైనా చేయొచ్చు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చు. మీరు మాత్రం పద్ధతిగా ఉండాల్సిందే’ అన్నట్లుగా చంద్రబాబుకు హితోక్తులు చెప్పారు. ‘‘అధికారం శాశ్వతం కాదు. పాపాలు పండుతాయి. చెడు సంప్రదాయాలు నెలకొల్పవద్దు!’ అని జగన్ సూక్తిముక్తావళి వినిపించారు. ఇదే విషయాన్ని తాను అధికారంలో ఉండగా జగన్ గుర్తుపెట్టుకుని ఉంటే… ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
‘ప్రజావేదిక’ కూల్చివేతతో మొదలైన జగన్ కక్షసాధింపు పాలన చంద్రబాబును అరెస్టు చేయించే దాకా వెళ్లింది. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా జగన్ ఏ ఒక్కరోజూ స్పందించలేదు. ‘ఇది తగదు. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు అన్నీ లెక్క పెట్టుకుంటారు’ అని ఇప్పుడు చెప్పిన మాటలు గత ఐదేళ్లలో ఒక్కరోజూ చెప్పలేదు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసినా, చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడినా, టీడీపీ నేత పట్టాభి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించినా, పల్నాడులో బీసీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపినా.. నోరు విప్పలేదు. పైగా.. దాడులు చేసిన వారికి ప్రోత్సాహకాలు, పదవులూ ఇచ్చారు. ఇక టీడీపీ శ్రేణులపై దాడులు చేసి, వారిపైనే ఎదురు కేసులు పెట్టడం ఐదేళ్లలో నిత్యకృత్యంగా మారింది. ఇప్పుడేమో… ‘వాళ్లే దాడులు చేస్తున్నారు. వాళ్లే కేసులు పెడుతున్నారు’ అని జగన్ వాపోతున్నారు.
మీరు ఇలా చేశారా?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ నాయకుడి భవనం కూలగొట్టించారని జగన్ ఆక్రోశించారు. ఇదే ఘటనలో కొలికపూడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను చంద్రబాబు పిలిచి మందలించారు. ‘ఏదైనా చట్టప్రకారమే చేయాలి’ అని తెలిపారు. ఇక.. ఒక మంత్రి భార్య ఎస్ఐపై దురుసుగా మాట్లాడిన ఘటనపై చంద్రబాబు అప్పటికప్పుడు స్పందించారు. మంత్రితో మాట్లాడి.. ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ఐదేళ్లలో జగన్ ఇలా ఏ ఒక్క ఘటనపైనైనా స్పందించారా? అరాచకాలకు పాల్పడుతున్న తమ శ్రేణులను మందలించారా? ఐదేళ్లలో తాను చేసింది మరిచిపోయి.. ఇప్పుడు వాపోతే జనం నమ్ముతారా? నవ్వుతారా?