ఏపీలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలిస్తే.. మనకు తెలియకుండానే మన కిడ్నీలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుం టాడని.. అవసరమైతే అమ్మేస్తాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ప్రతిపక్షాలను జగన్ ఇబ్బంది పెడుతున్నాడని అయ్యన్న ధ్వజమెత్తారు. ప్రపంచంలో తెలుగువారి గౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్ అని కొనియాడారు. నటనలో ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరని.. ఏ పాత్రలో నటించినా అందులో లీనమయ్యే వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.
మహానాడులో రెండో రోజు పాల్గొన్న అయ్యన్న వైసీపీ నేతలపైనా.. సీఎం జగన్‌పైనా తీవ్రవిమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమేలుతోందని.. పింఛను 3 వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని అయ్యన్న దుయ్యబట్టారు. జగన్మోహన్రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ కార్యకర్తలు తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కట్టలేదని.. జగన్ పాలనలో ఏ మంత్రికీ విషయ పరిజ్ఞానం లేదని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.
మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ టీడీపీ రావాలని.. ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపుని చ్చారు. జగన్ పాలనలో ఇప్పటికే రాష్ట్రం సర్వ నాశనమైందని, మరోసారి జగన్ వస్తే.. ప్రజల కిడ్నీలను మనకు తెలియకుండానే తాకట్టు పెట్టేస్తాడని.. అవసరమైతే.. సైతం అమ్మేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ తాగి వేలాది మంది చనిపోయారని అన్నారు. అయినా.. మద్యాన్ని పారిస్తున్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ టీడీపీ కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.