కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, రాబోయే ఎన్నికల్లో అటువంటి వారికి టికెట్లు ఇవ్వబోనని జగన్ కరాఖండిగా తేల్చి చెప్పేశారట. దీంతో, జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది ఎమ్మెల్యేలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి కాబోయే ప్రధాని జగన్ అని ఆకాశానికెత్తేశారు ప్రసన్న కుమార్. మిగిలిన రాష్ట్రాల సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని కూడా కితాబిచ్చారు ఆయన. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ కే జనం పట్టాభిషేకం జరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెబుతున్నారాయన. ఏదో ఒకరోజు జగన్ దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు పక్క రాష్ట్రాల్లో కూడా ఏపీ పథకాలను కాపీ కొడుతున్నారని, జగన్ సుపరిపాలనతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పొగడ్తలతో ముంచెత్తారు ప్రసన్న కుమార్ రెడ్డి.
జగనన్న కాలనీల్లో కుటుంబానికి సరిపోదని, శోభనం హాల్లోనే చేసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ కు సైతం కోపం తెప్పించాయి. గడప గడప కార్యక్రమానికి కూడా వెళ్లకుండా ఆయన జగన్ కంట్లో పడ్డారు. దీంతోపాటు, ప్రసన్నకుమార్ పోటీ చేసిన కోవూరులో కొత్త వ్యక్తికి సీటిస్తారని టాక్ వస్తోంది. దీంతో, జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రసన్న కుమార్ నానా తిప్పలు పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.