కొద్ది నెలల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా మోహన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ పై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో 6 నెలల పాటు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని, ఆ తర్వాత ఉండరు…ఉండలేరు అని చింతా మోహన్ బల్లగుద్ది మరీ చెప్పారు. సీఎం జగన్ ధర్మయుద్ధంలో గెలవలేరని , ప్రలోభాలకు గురిచేస్తే గెలవచ్చేమోనని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు.
జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని, మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ సీఎం కావడం తథ్యమని చింతా మోహన్ జోస్యం చెప్పారు.
తన బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఉత్తరాది పారిశ్రామిక వేత్త, ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
మరి కొద్ది వారాల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అరెస్టును చింతా మోహన్ ఖండించారు. నరసాపురం ఎంపీ రఘురామను కస్టడీలో కొట్టడం తప్పని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో తుది తీర్పు రాబోతోందని, జగన్ బెయిల్ రద్దు కాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ మరి కొద్ది వారాలే సీఎంగా ఉండబోతున్నారని చింతా మోహన్ వంటి సీనియర్ నేత వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.