అప్పుచేసి పప్పు కూడు- అనే నానుడి ఏపీ సీఎం జగన్కు అక్షరాలా సరిపోతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అప్పు చేసి.. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరుకుందా? అని నిన్ననే హైకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా ఏ మాత్రం వెరుపు లేకుండా తాజాగా ఆయన 4339.39 కోట్ల రూపాయలను పంచేశారు. రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన మహిళలకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఏడాదికి 18750 రూపాయల వంతున ఇచ్చే వైఎస్సార్ చేయూత ను సీఎం జగన్ తాజాగా ప్రారంభించారు.
ఈ పథకం కింద.. వరుసగా రెండో సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు లబ్ది పొందనున్నారు. మొత్తంగా 23.14 లక్షల మంది మహిళలకు నాలుగు సంవత్సరాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నిజానికి.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. అయితే.. రాష్ట్ర అభివృద్ధికి దోహద పడాల్సిన నిధులను ఇలా పంచేయడం వల్ల.. ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. ప్రజలకు ఉపాధి చూపించాలని.. ఉద్యోగాలు కల్పించాలని.. అంతే తప్ప, నేరుగా నిధులు ఇవ్వొద్దని.. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు.
దీనివల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా హైకోర్టులో కాంట్రాక్టర్లు.. తమకు చేసిన పనులకు సంబంధించిన రావాల్సిన నిధులను 980 కోట్లు.. ప్రభుత్వం ఇవ్వడం లేదని.. పేర్కొంటూ.. పిటిషన్ వేశారు. ఈ నిధులు ఎందుకు ఇవ్వడం లేదని.. కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. అందుకే ఇవ్వలేక పోతున్నామని.. వివరణ ఇచ్చిన ప్రభుత్వం తెల్లారేసరికి చేయూత పథకం కింద ఏకంగా 4 వేల కోట్లు పంపకం చేయడం విస్మయం కలిగిస్తోంది.
ఇక, కాంట్రాక్టర్లు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే.. రాష్ట్రం దివాలా తీసిందనే అనుకోవాలా? అని ప్రశ్నించారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు.. కోర్టుల నుంచి పదునైన వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పుడు.. ప్రభుత్వం మహిళలకు మరో రూపంలో సాయం చేయొచ్చు.. వారికిఉపాధి చూపించొచ్చుకదా! అనే సూచనలు వస్తున్నాయి.