ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మే 9న ప్రపంచ మాతృదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు….తమ మాతృమూర్తుల ఫొటోలను పెట్టి మరీ మదర్స్ డే విషెస్ తెలిపారు. తమ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలలో డీపీలు, స్టేటస్ లుగా ఫొటోలు పెట్టి మరీ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, ఏపీ సీఎం జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు అని జగన్ కేవలం ట్వీట్ చేసి వదిలేయడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్వీట్ చేసిన జగన్ విజయమ్మ ఫొటో పెట్టకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిలకు వైఎస్ విజయమ్మ మద్దతుగా ఉన్నందునే జగన్ …విజయమ్మ ఫొటోపెట్టలేదని కామెంట్లు చేస్తున్నారు. చెల్లెలికి తన తల్లి విజయమ్మ సపోర్ట్ చేసిందన్న అక్కసుతోనే జగన్….ఈరకంగా చేశారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాలు వేరు రక్త సంబంధం వేరన్న సంగతి కూడా జగన్ గుర్తెరగడం లేదని గడ్డి పెడుతున్నారు. కక్ష సాధించడంలో జగన్ కు తన మన తేడా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.