ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కియా మోటర్స్, అమరరాజా, హెచ్ ఎస్బీసీ, ఐబీఎం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలు వెళ్లిపోయాయి. దీంతోపాటు ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా పొరుగురాష్ట్రాలకు తరలిపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఉన్న కంపెనీలన్నీ పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే….మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పాలనా రాజధాని విశాఖ కొత్త కంపెనీలతో విరాజిల్లుతోందంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
కొత్త కంపెనీల మాట దేవుడెరుగు…కనీసం ఆల్రెడీ ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత.
కానీ, ఆ కనీస బాధ్యతగా ఉండడం చేతగాని జగన్ సర్కార్…విశాఖను ఐటీ హబ్ గా చేస్తాననడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఫార్చ్యూన్-500 కంపెనీలతో చర్చించి, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇప్పించడంతో అప్పట్లో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది.
జగన్ పగ్గాలు చేపట్టాక అనుకూల వాతావరణం లేక పలు సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఏపీలో వ్యాపారానికి అనుకూలప ప్రభుత్వం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో ‘టీ’ హబ్ ఏర్పాటు చేస్తూ హైటెక్ సిటీకి దీటుగా మరో ఐటీ కారిడార్ కు బీజం వేశారు. ఇక, ఒరిస్సాలో ‘ఓ’ హబ్ పేరుతో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేశారు. కానీ, ఏపీలో మాత్రం జగన్ ఐటీ కంపెనీల విషయంలో చిత్ర విచిత్రంగా వ్యవహరించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఏపీలో జగన్ మటన్ మార్ట్ లపై ఫోకస్ చేస్తున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజా మటన్, చేపలను డోర్ డెలివరీ చేసేందుకు కూడా జగన్ ప్లాన్ చేస్తున్నారని, ఏపీలో మటన్ హబ్…టీ హబ్, ఓ హబ్ లను తలదన్నేలా ఉంటుందని మీమ్స్ పేలుస్తున్నారు. ‘టీ’ హబ్, ‘ఓ’ హబ్ ల తరహాలో ఏపీలో ఎం..ఫర్ మటన్ హబ్ ను జగన్ ఏర్పాటు చేయబోతున్నారని ట్రోల్ చేస్తున్నారు.