వీవీఐపీలు పర్యటిస్తున్నారంటే.. ఓ రెండు గంటల ముందు నుంచి లేదా.. ఒక పూట నుంచి పోలీసులు ఆయా ప్రాంతాల్లో హడావుడి చేయడం సహజం. ఎందుకంటే.. ఆయా వీవీఐపీల స్థాయిలను బట్టి.. ఈ అజమాయిషీ ఉంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, తాను జననేతను అని చెప్పుకొనేఏపీ సీఎం జగన్ పర్యటన విషయంలోనే పోలీసులు.. మరింత ఎక్కువగా.. హడావుడి చేస్తున్నారనే విమర్శలు రెండూ వినిపిస్తున్నాయి.
గతంలో చంద్రబాబు ఎక్కడైనా పర్యటించినప్పుడు.. జనజీవనం నిలిచిపోకుండా.. వారి వ్యాపారాలకు దెబ్బతగలకుండా.. ఏర్పాట్లు చేయాలని.. ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. డీజీపీ రాముడు ఉన్న సమయంలో ఒకసారి.. చోటు చేసుకున్న హడావుడిపై పత్రికల్లో కథనాలు రావడంతో.. చంద్రబాబు సీరియస్ అయి.. అసలు.. ఇక మీదట కేవలం గంట ముందు మాత్రమే.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలా.. కొన్ని మార్పులు చేశారు.
అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పర్యటన అంటే.. ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి నెలకొందని.. ప్రజలు వాపోతున్నారు. ఏదైనా పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన ఉందంటే అక్కడి వారు హడలిపోతున్నారు. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందే అధికారులు ఆ ప్రాంతాన్ని అష్ట దిగ్బంధం చేస్తున్నారు.
తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రేపు (17న) సీఎం సభ ఉండగా 14న అర్ధరాత్రి నుంచే అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. ఆళ్లగడ్డలోని వైపీపీఎం కళాశాల ఆవరణలో సభ నిర్వహించనున్నారు. ఇందుకు కళాశాల సమీపంలోని రోడ్డు విస్తరించాలని ఏడు దుకాణాలను తొలగించారు.
హెలిప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు 1.2 కి.మీ. మేర రోడ్డుకు రెండు వైపులా శనివారమే బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో దుకాణాలకు వినియోగదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
మూడు, నాలుగు రోజులపాటు షాపులు తెరవకపోతే మా భృతి ఏంటని దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు 17న పాఠశాలల బస్సులు, వ్యాన్లు సీఎం సభకు పంపిస్తున్నామని, ఆ రోజు పిల్లలను తల్లిదండ్రులే పాఠశాలలకు తీసుకొచ్చి, తీసుకెళ్లాలని నంద్యాలలోని పలు ప్రైవేటు బడుల ప్రిన్సిపాళ్లు తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నారు. ఆళ్లగడ్డలోని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరి.. దీనిని జననేతగా చెప్పుకొనే జగన్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి.