2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజలకు ముద్దులు పెడుతూ ముందుకు సాగిపోయిన సంగతి తెలిసిందే. తనను తాను దైవాంశ సంభూతుడిగా ఫీల్ అయిన జగన్…జనం నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ అలా అలా వెళ్లిపోయారు. కట్ చేస్తే సీఎం అయిన తర్వాత జనానికి ముద్దుల స్థానంలో జగన్ పిడిగుద్దులు కురిపిస్తుండగా… జగన్ ఆశీర్వాదాలకు బదులుగా ఆయనకు జనం శాపనార్ధాలు పెడుతున్నారు. ఒక్క చాన్స్ అంటూ నెత్తిన చేయి పెడితే చాన్స్ ఇచ్చామని, ఇంకోసారి చాన్స్ ఇవ్వబోమని ప్రజలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ మరోసారి జనం నెత్తిన చేయి పెట్టేందుకు ‘ఆశీర్వాద’ యాత్ర చేపట్టబోతున్నారు.
‘ఆశీర్వాద’ యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చేనెల నుంచి ఈ యాత్రను మొదలుపెట్టాలని జగన్ అనుకుంటున్నారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఎంఎల్ఏలకు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే. వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా ఆ అంతరాన్ని పూరించవచ్చని జగన్ అనుకుంటున్నారు. పర్యటనల్లో నియోజకవర్గాలలోని సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించబోతున్నారు.
అలాగే ఎంఎల్ఏల పని తీరును మదింపు చేయాలని, ద్వితీయశ్రేణి నేతల భాగస్వామ్యం పార్టీలో ఎలా ఉంది, క్యాడర్ ఆలోచనలు ఏమిటనే విషయాన్ని కూడా జగన్ డైరెక్టుగా తెలుసుకోబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలకు పార్టీ నేతలు, క్యాడర్ తో గ్యాప్ వచ్చినట్లు తన సర్వేల్లో తేలిందట. అలాగే మరికొందరు ఎంఎల్ఏల వైఖరిపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టుగా నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళాలని అనుకున్నట్లు సమాచారం.
నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళినపుడు పార్టీ విషయంలో క్షేత్రస్థాయి పరిస్ధితి ఏమిటో కూడా అర్ధమవుతుంది. అప్పుడే ఎంతమంది ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత ఉంది ? ద్వితీయ శ్రేణి నేతలు ఎందుకని పార్టీకి దూరంగా ఉంటున్నారు? పార్టీకి పనిచేస్తున్న నేతలు ఎవరనే విషయాలపై స్పష్టత వస్తుందని జగన్ అనుకుంటున్నారట. అందుకనే వచ్చేనెల నుండి ప్రజా ఆశీర్వాద యాత్ర పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు పెట్టుకున్న యాత్రలు కాబట్టి పార్టీకి మంచి మైలేజీని ఇస్తాయని ఆశిస్తున్నారు.
పనిలోపనిగా సంక్షేమ పథకాల లబ్దిదారులతో కూడా ముఖాముఖి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు ఎలాగూ తప్పవు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని జనాలకు వివరించడానికే జగన్ ఈ యాత్ర పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఏదో కార్యక్రమం పేరుతో ఏదో ఒక నియోజకవర్గంలో మాత్రమే పర్యటిస్తున్నారు. అంతేగానీ నియోజకవర్గాల పర్యటనే ముఖ్య ఉద్దేశ్యంగా పర్యటించిందిలేదు. అందుకనే ఆ కొరతను ఎన్నికలకు ముందు పర్యటనల పేరుతో భర్తీ చేయబోతున్నారు. మరి ఈ యాత్రలు వైసీపీకి ఎంతవరకు పాజిటివ్ గా ఉంటాయో చూడాల్సిందే.