సజ్జల….గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిత్యం సీఎం జగన్ కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి పేరుకు మాత్రమే ఏపీ ప్రభుత్వ సలహాదారు అని, కానీ సీఎం జగన్ తర్వాత పార్టీలో ఆయన నంబర్ టూ గా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు మొదలు తాజాగా వేటుపడిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేల వరకు అందరి వేళ్లూ సజ్జల వైపే.
పార్టీలో చేసేదంతా సజ్జలేనని, జగన్ కేవలం నామమాత్రపు ముఖ్యమంత్రి అని బాహాటంగానే వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, తనపై వేటు పడినప్పటికీ సీఎం జగన్ చాలా మంచి మనసున్న మనిషి అని, ఇప్పటికీ ఆయన అంటే తనకు గౌరవం ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం సస్పెన్షన్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పడం చర్చనీయాంశమైంది. జగన్ కు చెవులు మాత్రమే ఉంటాయని ఆయన ఎవరేం చెప్పినా వింటారని, ఆయన పక్కనుండే వారే ఆయనకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని జగన్ ను వెనకేసుకొచ్చారు శ్రీదేవి.
ఒక్క శ్రీదేవి కాదు చాలా కాలం క్రితం చాలాకాలంగా వైసీపీ రెబెల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు సైతం ఇదే మాట చెబుతున్నారు. సజ్జలతో పాటు మరికొందరు జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని, దాంతోపాటు జగన్ నియంతృత్వ ధోరణి, ఫ్యాక్షన్ స్వభావం వల్లే ఆయనకు చెడ్డ పేరు వస్తుందని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. తాజా ఎన్నికల ఓటమితో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా సజ్జలపై జగన్ ముందు గోడు వెళ్ళబోసుకున్నారట.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలందరితో జగన్ మాట్లాడడంతో సజ్జల వ్యవహారం ఆయన దృష్టికి బలంగా చేరిందని టాక్ వస్తుంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ చెక్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. జగన్ పర్ఫెక్ట్ గానే ఉన్నారని కానీ చేస్తున్నదంతా సజ్జలేనని మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్ ముందు మొహమాటం లేకుండా చెప్పేశారట. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కూడా సజ్జలే కారణమని ఎమ్మెల్యేలు జగన్ కు ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు తర్వాత జరిగిన దెందులూరు లో జరిగిన తొలి సభలో జగన్ ప్రసంగంలో పెను మార్పులు వచ్చాయని, గతంలో సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం దుష్ట చతుష్టయం, ఆ నాలుగు టీవీ ఛానల్స్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటూ దీర్ఘాలు తీసి విమర్శలు గుప్పించే జగన్ ఆ సభలో మాత్రం కేవలం సంక్షేమ పథకాలు, తమ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేయలేదు అన్న విషయాల వరకే పరిమితమయ్యారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సజ్జలకు చెక్ పెట్టి ఇకపై తనంతట తానే నిర్ణయాలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.