అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల కోసం పోరాడే వాళ్లను నాయకులు అంటారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నాయకులు అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు. అధికారం ఉందని విర్రవీగేవాళ్లే ఎక్కువ. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కోవలోకే వస్తారనే అభిప్రాయాలున్నాయి. గత అయిదేళ్లు అధికారంలో ఉన్న జగన్ జనాలను పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. తాడేపల్లి గూడెం ప్యాలెస్‌లోనే ఉంటూ సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే.
సీఎంగా ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకపోవడంతో వాళ్లు జగన్‌కు తగిన బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఆ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఈ ఓటమితోనే జగన్‌కు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. అందుకే మరోసారి జనం బాట పట్టేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పుడు కానీ తిరిగి ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీ మనుగడ కష్టమని జగన్‌కు తెలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజాదర్బార్, జిల్లాల పర్యటన అంటూ జనం మంత్రం పఠిస్తున్నారు జగన్.
జగన్ ఇకపై పార్టీ నేతలు, కేడర్‌తో పాటు సామాన్య జనాలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే తాడేపల్లిలోని తన ప్యాలెస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ నెల 15 నుంచి ఈ ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. అలాగే జిల్లాల పర్యటన కూడా చేయాలని జగన్ అనుకుంటున్నట్లు టాక్. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాలకు జగన్ వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.