ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “జగన్ .. కొశ్చన్ పేపర్ దొంగతనం చేశాడు. అయినా పాసయ్యాడో లేదో తెలీదు“ అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ తాజాగా పాయకరావు పేట నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తే.. జగన్ సీఎం అయ్యాక గంజాయి తెచ్చాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో రోజుకో మర్డర్, కిడ్నాప్, కబ్జాలు, దందాలు జరుగుతున్నాయి.“ అని విమర్శించారు.
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని నారా లోకేష్ అన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. భూ దందాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారని ఆరోపించారు. ఈ మధ్య సీఎం జగన్ తండ్రి వయసున్న చంద్రబాబును పట్టుకుని ముసలోడు అంటున్నారని.. ఈ సభా ముఖంగా ఎవరు ముసలోడో తేల్చుదాం అన్నారు.
‘జగన్ బస్సు దిగాలంటే స్టూలు ఉండాలి.. శంకుస్థాపనలో రాయి పైకి ఎత్తిపెడితేకానీ కొబ్బరికాయ కొట్టే పరిస్థితి.. ఎవరు ముసలోడు?. సాయంత్రం 6 గంటల తర్వాత జగన్ కు కనబడడు. పట్టుమని ఒక గంటపాటు కూడా ఒక శాఖపై సమీక్ష చేయలేడు. బైక్ నడిపితే నలుగురు పట్టుకుంటేగానీ కదల్లేని పరిస్థితి. తిరుమల కొండ, రామతీర్థం కొండకు చంద్రబాబు, జగన్ నడిస్తే ఎవరు మసలోడో ప్రజలకు అర్థమవుతుందని’ ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.
ఇక్కడి ఎమ్మెల్యేకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో తెలుసా? నన్ను, పవన్, చంద్రబాబును బూతులు తిట్టలేదని..బూతులు తిడితే టికెట్ ఇస్తానంటే తాను తిట్టలేనని చెప్పాడంతో టికెట్ గల్లంతయిందన్నారు. “నవరత్నాలు అని ఇప్పుడు బూతుల రత్నాలు ఇస్తున్నాడు జగన్. బూతుల రత్న కొడాలి నానికి ఇచ్చాడ“ని ఎద్దేవా చేశారు. జగన్ 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితక్కొట్టించుకున్నాడని అన్నారు. “నేను స్టాన్ ఫోర్డ్ యూనివవర్సిటీలో చదివితే.. జగన్ ది క్వచ్చన్ పేపర్ దొంగతనం చేసిన చరిత్ర“ అని లోకేష్ వ్యాఖ్యానించారు.