తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ నాటి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని జగన్ మాట ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా సరే జగన్ తన హామీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. పర్మినెంట్ చేసే సంగతి అలా ఉంచితే వారిలో చాలామందిని సర్వీసు నిబంధనల పేరుతో తొలగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
పదేళ్లలోపు సర్వీసు ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసేందుకు జగన్ సన్నాహాలు మొదలుబెట్టారని ఓ పత్రికలో కథనం వచ్చింది. ఈ ప్రకారం ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రభుత్వం రహస్యంగా ఆదేశాలు జారీ చేసిందని కూడా ఆ కథనంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ కథనంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్…సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తారని, క్రమబద్ధీకరిస్తారని రెండున్నర లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని లోకేష్ అన్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లి, వారి ఉపాధిపై జగన్ వేటు వేయబోతున్నారని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అటువంటి జగన్ ను ఎందుకు నమ్మాలని లోకేష్ ప్రశ్నించారు. ఇక, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, అందుకే జగన్ కు నిరుద్యోగులంతా ఓట్లు వేసి గెలిపించారని లోకేష్ గుర్తు చేశారు. కానీ, అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా జగన్ వేయలేదని మండిపడ్డారు.
ఇక, సీఎం అయిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్…150 వారాలైనా రద్దు చేయలేదని సెటైర్లు వేశారు. సిపిఎస్ రద్దు తరహా లోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ కూడా గాల్లో కలిసిపోయిందని జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు.