సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ లేదని పాత్రికేయులు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. నా ప్రెస్ మీట్లకు ఫలానా ఛానెళ్ల ప్రతినిధులు రావొద్దంటూ సాక్షాత్తూ సీఎం హోదాలో జగన్ చెప్పడం గతంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక, ఏబీఎన్, ఈనాడు, టీవీ5, మహా న్యూస్ లను జగన్ తో పాటు వైసీపీ నేతలు టార్గెట్ చేయడం, కొడాలి నాని వంటి నేతలైతే డైరెక్ట్ గా ఆయా సంస్థలు, వాటి యజమానులను పేరు పెట్టి మరీ విమర్శించడం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ నియంత పాలనకు ఈ నోటీసులే నిదర్శనమని అచ్చెన్న విమర్శించారు. బీఆర్ నాయుడు చేసిన తప్పేంటి? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఆయనేమైనా పాకిస్థాన్ బోర్డర్ కు వెళ్లి టెర్రరిస్టులను కలిశారా? అని నిలదీశారు.
అమరావతి రైతులకు మద్దతు పలకడమే బీఆర్ నాయుడు, టీవీ5 చేసిన నేరమా? అని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతును నులిమి వేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా రంగం అని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియాపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు. జగన్ ఇకనైనా నియంత లక్షణాలు వీడాలని, ప్రజాస్వామ్య పాలన అలవర్చుకోవాలని హితవు పలికారు.