మార్గదర్శి చిట్ ఫండ్ కు సంబంధించిన ఇష్యూ ఒకటి ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు ఎండీగా నిర్వహించే ఈ సంస్థ సంగతి చూడాలన్న లక్ష్యంతో జగన్ సర్కారు వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన మేనేజర్ల ఇళ్లల్లో సోదాలునిర్వహించటం.. కొందరిని అదుపులోకి తీసుకోవటం.. అరెస్టు చేయటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం రామోజీరావుకు.. మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ కమ్ రామోజీ పెద్ద కొడుకు భార్య అయిన శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన ఆడిటింగ్ వ్యవహారాల్ని చూసే ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో సంస్థసై ఏపీ సీఐడీ నిర్వహించిన సోదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అన్నింటికి మించిన ఈ సంస్థలో సోదాలు నిర్వహించిన తీరుపై విస్మయం వ్యక్తం కావటమే కాదు.. ఆడిటర్ల వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. గడిచిన 80 ఏళ్లుగా వివిధ కార్పొరేట్ సంస్థలకు ఆడిటింగ్ వ్యవహారాలు చూసే ప్రముఖ ఆడిటింగ్ సంస్థగా దీనికి పేరుంది. విలువలతో కూడిన సేవలు అందిస్తారన్న పేరుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ప్రపంచంలోనూ.. ప్రముఖ వ్యాపార వర్గాల్లో ఈ సంస్థకున్న పేరుప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు.
హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుల్లో ఈ సంస్థ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటుంది. అయితే.. హైదరాబాద్ లోనే నిర్వహించే ఈ సంస్థ చాలా పాతదన్న పేరుంది. మార్గదర్శి ఎపిసోడ్ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వేళలో ఖైరతాబాద్ లోని సంస్థకు చెందిన కార్యాలయానికి దాదాపు యాబైకు పైగా సీఐడీ అధికారులు ఒక్కసారిగా సంస్థ కార్యాలయంలోకి వచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు సీసీ కెమేరాల వైర్లను కట్ చేయటంతో పాటు.. సిబ్బంది ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ్రహ్మయ్య అండ్ కో సీనియర్ పార్టనర్ అయిన 75 ఏళ్ల కోటేశ్వరరావు విషయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత పెద్దవయసున్న ఆయన పట్లవిచారణ విషయంలో ఏపీ సీఐడీ అధికారులు కఠినంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. దాదాపు 27 గంటల పాటు సాగిన విచారణ సందర్భంగా.. భోజనం కోసం బయటకు వెళ్లేందుకు (అవసరమైతే పరిమిత సంఖ్యలో సిబ్బందితో కలిసి బయటకుతీసుకెళ్లి భోజనం చేయించే వీలుందంటున్నారు) అనుమతి ఇవ్వలేదు. వయసు రీత్యా కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి కూడా అనుమతి ఇవ్వలేదని చెబుతుననారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పలుపత్రాల్ని.. హార్డ్ డిస్కుల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. మార్గదర్శి సంస్థకు చెందినవే కాదు.. ఇతరసంస్థల సమాచారాన్ని కాపీ చేసుకొని వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏదైనా కంపెనీకి చెందిన సమాచారాన్ని ఛార్టెడ్ అకౌంటెంట్ చట్టం నిబంధనల మేరకే వెల్లడించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా ఆడిట్ కంపెనీ వద్ద ఉన్న ఇతర ఖాతాదారులకు చెందిన సమాచారాన్ని ఎలా తీసుకెళతారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై న్యాయ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా 75 ఏళ్ల వయసున్న ఒక ప్రముఖ ఆడిటర్ విషయంలో వ్యవహరించాల్సిన తీరు అయితే ఇలా ఉండకూడదన్న మాట ఏపీ సీఐడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.