న్యాయం జరగటం ఏ మాత్రం ఆలస్యం జరిగినా.. జరిగే నష్టం ఎక్కువని. కారణాలు ఏవైనా కానీ.. కేసుల విచారణ ఆలస్యం కావటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా వకీల్ సాబ్ టికెట్ల ధరల విషయంలో కేవలం రెండు రోజుల్లోనే ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఇష్యూలో న్యాయస్థానాల పాత్ర కన్నా.. రాజకీయం కీలక భూమిక పోషించింది.మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం శుక్రవారం విడుదల కావటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి భిన్నంగా ఏపీలో వకీల్ సాబ్ టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పరంగా విధానపరమైన మార్పులు చేయాలంటే.. ఒక అగ్రహీరో సినిమా రిలీజ్ సమయంలోనే తీసుకోవాలా? అన్నది ప్రశ్న. రాజకీయంగా జగన్.. పవన్ లు భిన్నధ్రువాలు అన్నది తెలిసిందే. అలాంటివేళలో ప్రేక్షకులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అయినప్పుడు ముందే నిర్ణయం తీసుకోవచ్చు కదా? అందుకు భిన్నంగా..సరిగ్గా సినిమా రిలీజ్ వేళలో తీసుకున్ననిర్ణయం రాజకీయ రగడతో పాటు.. చిత్ర నిర్మాతకు.. ఎగ్జిబిటర్లకు నష్టం వాటిల్లేలా చేసింది. వ్యాపారపరంగా.. రాజకీయం రాజకీయంగా ఉన్నంత వరకు బాగుంటుంది. అంతకుమించి వెళితే జరిగే నష్టం అనూహ్యంగా ఉంటుంది.
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద రివ్యూ చేయటం.. రివర్సు టెండరింగ్ మీద జరిగిన రభస అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న జగన్ మాట తప్పన్న విషయం కేంద్రం జోక్యం చేసుకొని.. అనవసర రచ్చలకు దూరంగా ఉండాలని చెప్పటాన్ని మర్చిపోకూడదు.రాజకీయ ప్రత్యర్థుల్ని దారికి తీసుకొచ్చేందుకు అధికారంలో ఉన్న అధినేతలు ఒక్కొక్కరు ఒక్కోలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరునే చూస్తే.. ఆయన తన ప్రత్యర్థుల్ని కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తారు. ఆ విషయంలో మరో మాటకుతావు ఉండదు.
కానీ.. అందుకు రాష్ట్ర ఇమేజ్ ను బలి పెట్టే ప్రయత్నం చేయరు. ఆ మాటకు వస్తే.. సామాన్యులు చర్చించుకునేలా ఆయన దెబ్బ తీయటం ఉండదు. దీని వల్ల జరిగే లాభం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తన రాజకీయ ప్రత్యర్థులపై అవసరమైన ప్రతీకారాన్ని తీర్చుకోవటం. రెండోది.. ఆ కారణంగా రాష్ట్ర ఇమేజ్ కు ఎలాంటి దెబ్బ తగలకుండా ఉండటం.ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతి విషయాన్నే చూస్తే.. మూడు రాజధానుల పేరుతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాజకీయంగా చంద్రబాబు అండ్ కోను దెబ్బ తీయటంతో పాటు.. ఆయన సామాజిక వర్గ ఆర్థిక మూలాలపై ప్రభావం చూపేలా ఉండొచ్చు.
కానీ.. అంతకు మించి అన్నట్లుగా ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం దెబ్బ తిన్నదన్నది మర్చిపోకూడదు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్.. పవర్లోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం ఏపీ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు.. రాష్ట్రానికి వచ్చిన పలు ప్రాజెక్టులు వెనక్కి వెళ్లేలా చేశాయన్నది వాస్తవం.కట్ చేస్తే.. ఏపీ సర్కారుకు పవన్ తో బోలెడన్ని పంచాయితీలు ఉండొచ్చు. వకీల్ సాబ్ చిత్ర టికెట్ల ధరల్ని తగ్గించటం ద్వారా జరిగే నష్టం పవన్ కల్యాణ్ కు మాత్రమే కాదన్నది మర్చిపోకూడదు.
అదే సమయంలో.. తన ప్రత్యర్థుల విషయంలో జగన్ సర్కారు ఏదో చికాకు పెట్టే అలవాటు ఉందన్న మాట.. ఏపీ ఇమేజ్ కు అంత మంచిది కాదు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు బెంచ్ సవరించింది. కానీ..అంతలోనే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. ఈ ఎపిసోడ్ కొందరికి ఆనందాన్ని.. మరికొందరికి బాధను కలిగించొచ్చు. కానీ.. అదంతా తాత్కాలికమే. కానీ.. ఏపీకి పరిచయమవుతున్న సాధింపు చర్యల ప్రభావం రాష్ట్రం మీద దీర్ఘకాలం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అది ఏపీకి ఏ మాత్రం మంచిది కాదు.