సీఎం జగన్…ఒక్క చాన్స్…ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారం దక్కించుకున్న మాస్టర్ బ్రెయిన్. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అధికారం దక్కించుకున్నా…జైలులో ఉండే తన చెల్లెలితో ప్రచారం చేయించి విజయం అంచులదాకా వెళ్లినా…అది ఒక్క జగన్ కే చెల్లింది. జగన్ కు రాజకీయ అనుభవం లేదు…అని అంతా అంటుంటారుగానీ…వాస్తవానికి జగన్ కుటిల రాజకీయాలు చేయడంలో దిట్ట అన్న సంగతి అతికొద్దిమందికే తెలుసు.
తమ పార్టీలోని చాలా మంది అసంతృప్తి నేతలకు పదవులు పంచిపెట్టేందుకే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ పూనుకున్నారన్నది కొంతవరకు వాస్తవమే. కానీ, ఈ కొత్త జిల్లాల తెర వెనుక జగన్ సక్సెస్ ఫుల్ గా గతంలో వర్కవుట్ అయిన ఓ పాత ప్లాన్ ను అమలు చేసేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారన్నది అసలు సీక్రెట్. 2009లో నియోజకవర్గాల పునర్విభజనను అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్…టీడీపీని నియంత్రించే ప్రయత్నం చేసింది.
అదే తరహాలో ఇప్పుడు జిల్లాల విభజన మంత్రంలో జగన్ మరోసారి టీడీపీని కట్టడి చేసేందుకు స్కెచ్ వేశారని టాక్ వస్తోంది. ఎందుకంటే 2026లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా దాదాపుగా జిల్లాల ప్రాతిపదికనే జరిగే చాన్స్ ఉంది. అందుకే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే…ఆ తర్వాతి ఎన్నికల్లో కొత్త జిల్లాల అంశం, నియోజకవర్గాల పునర్విభజన కలిసి వచ్చే అవకాశముంది.
దాంతోపాటు, టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లను చీల్చేందుకు వీలుగా కొత్త జిల్లాలను జగన్ విభజించారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి ఆర్థికంగా గట్టి పట్టున్న మండపేటలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ఎదురెళ్లి మరీ టీడీపీ గెలిచింది. అయితే, తాజాగా ఆ నియోజకవర్గం కోనసీమ జిల్లాలోకి వెళ్లింది. కోనసీమ జిల్లాలో ఎస్సీ, కాపు, శెట్టిబలిజలకు గట్టి పట్టుంది. మండపేటలో కాపు, శెట్టిబలిజలతో కమ్మ సామాజికవర్గానికి గొడవలున్నాయి. దీంతో, కోనసీమ జిల్లాలో ఈ సారి టీడీపీకి గట్టిపోటీని వైసీపీ ఇచ్చే అవకాశముంటుంది.
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలోనూ కోనసీమ జిల్లా ఫార్ములా తరహాలోనే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలా జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుటవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆ సామాజికవర్గం టార్గెట్ గా జగన్ స్కెచ్ వర్కవుటయితే మాత్రం రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరింత గట్టిగా అధికార పార్టీ నేతలతో పాటు సామాజిక వర్గాల నేతలతోనూ పోరాడాల్సి ఉంటుంది.