ఇప్పటం! బహుశ.. ఇప్పటి వరకు పెద్దగా తెలియని పేరు. అయితే.. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. రహదారి విస్తరణ పనుల పేరిట ఆ గ్రామంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు రాజకీయ రచ్చకు దారితీసింది. అనూహ్యంగా అధికార పార్టీ వైసీపీకి ఇప్పటంపై ప్రేమ పెరిగిపోయిందా? లేక జనసేన సభకు ఇక్కడి రైతులు తమ భూములు ఇచ్చారనే పగ తీర్చుకుందా? ఇదీ.. ఇప్పుడు రేకెత్తుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటంపై జగన్ ది ప్రేమా? పగా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటంలోని ప్రధాన రోడ్డును ఉన్నట్టుండి.. 120 అడుగుల రహదారిగా విస్తరిస్తామంటూ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇతర భవనాలను.. వైసీపీ ప్రభుత్వం కూల్చేసింది. వెంటనే అన్నింటికి మార్కింగ్‌లు వేసి తొలగింపుపూర్తి చేసేసింది. అయితే, ఈ వ్యవహారం భుజాలపై ఎత్తుకున్న అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్థులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేత చేపడతారని నిలదీశారు. జేసీబీకి అడ్డుగా నిల్చున్నారు. వారిని పక్కకు నెట్టిన పోలీసులు, అక్రమణలను తొలగింపును కొనసాగించారు. ఈక్రమంలో ఉద్రిక్తత, ఏడుపులు, పెడబొబ్బలు చోటుచేసుకున్నాయి.
కొన్నేళ్లుగా గ్రామానికి బస్సు సౌకర్యమే లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి హఠాత్తుగా ప్రేమ పుట్టుకురావడమే ప్రధాన ప్రశ్న. అంతేకాదు, రాష్ట్రంలో అనేక ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు మోకాల్లోతు గుంతలు పడినా.. బధిరాంధత్వంలో వ్యవహరిస్తున్న పాలకులకు.. ఎక్కడో మారుమూలన ఉన్న.. పట్టుమని రోజుకు వెయ్యి మంది కూడా సంచరించని ప్రాంతంపై ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టుకురావడం వెనుక ఆంతర్యం తెలియాలి.
ఇక, గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా కష్టించి పోగేసుకున్న రూపాయి రూపాయితో నిర్మించుకున్న ఇళ్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కక్షపూరితంగా కూల్చివేస్తున్నారన్న ఆరోపణలను కూడా తోసిపుచ్చలేమని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్‌కల్యాణ్, కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వైసీపీకి ఓట్లేసిన వారికే పాలకులం అన్నట్లుగా ప్రభుత్వ తీరుందని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం విడ్డూరంగా ఉందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. స్థానిక జనసేన నేతలు సైతం వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామస్థులు, జనసేన నేతల ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. గతంలోనే రెండుసార్లు నోటీసులిచ్చి మార్కింగ్ చేసి తొలగింపు గురించి వివరించామని చెబుతున్నారు. అయినా ఎవరూ ముందుకు రావకపోవడంతోనే కూల్చివేత చేపట్టామని చెప్పారు. అయితే.. ఇంత హఠాత్తుగా ఎందుకు చేశారన్నదే ప్రధాన ప్రశ్న. అంత ప్రేమ ఉంటే.. అనేక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో రోడ్లులేక.. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. మరి అలాంటివి ఎందుకు కనిపించడం లేదనేదే ప్రశ్న. ఎలా చూసుకున్నా.. ఇప్పటంపై ప్రేమ కన్నా.. పగే ఎక్కువగా కనిపిస్తోందంటున్న రాజకీయ విమర్శలను తోసిపుచ్చలేమని అంటున్నారు పరిశీలకులు.