టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో ఏ1 నిందితుడిగా బాబును అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ చెబుతోంది. రూ.550 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశామని సీఐడీ బాస్ సంజయ్ ప్రకటించారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.371 కోట్లు.. డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్లు తేలిందని సీఐడీ వెల్లడించింది.
ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చేశారు. కానీ అరెస్టు చేసిన విధానం, సమయం కరెక్టు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ లండన్‌లో ఉన్నారు. మరోవైపు బాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో బాబును ఒక్క రోజైనా జైలులో ఉంచాలనే రాజకీయ కుట్రతోనే ఈ అరెస్టు జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్న బాబు దగ్గరకు రెండు బెటాలియన్ల పోలీసులను పంపి, అర్ధరాత్రి సీన్ క్రియేట్ చేయడం ఏమిటనే ఆరోపణలు వస్తున్నాయి.
శనివారం ఉదయం అయిదున్నర గంటల సమయంలో బస్సులో నుంచి బయటకు వచ్చి బాబు పోలీసులతో మాట్లాడారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలన్నారు. కానీ అవేమీ పట్టించుకోని పోలీసులు బాబును అరెస్టు చేశారు. అయితే రాజకీయ పర్యటనలో భాగంగా ఉన్న బాబును కక్ష్య పూరితంగానే అరెస్టు చేశారని టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలో విమర్శిస్తున్నాయి. బాబును ఒక్క రోజైనా జైలులో పెట్టాలనే సీఎం జగన్ కోరికను తీర్చుకునేందుకే ఇలా పోలీసు వ్యస్థను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.