ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ సర్కారు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఇక్కడి రైతులు మరో సారి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి.. మూడు రాజధానులు కాదు.. రాష్ట్రానికి ఏకైక రాజధానని కావాలని.. నినదించారు. ఇక, ఆ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు వచ్చాయి. అయితే.. ఎట్టకేలకు.. హైకోర్టు జోక్యంతో రైతులు ముం దుకు సాగారు. ఇంత జరిగినా.. రైతుల విషయంలోను.. అమరావతి విషయంలో సర్కారు న్యాయం చేయడం లేదనిరైతులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే వారు.. అమరావతి నుంచి అరసవల్లి వరకు.. పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తమ కు అనుమతి ఇవ్వాలని.. రాష్ట్ర పోలీసులకు విన్నవించారు. అయితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఈ నెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. సర్కారు కానీ, పోలీసులు కానీ.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా తెలపలేదు. దీంతో రైతులు.. మరోసారి హైకోర్టు గడప తొక్కారు.
ఈ క్రమంలో హైకోర్టు విచారణ జరిపింది. అనుమతిపై అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదని రైతుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టి కి తెచ్చారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి సంబంధించి శుక్రవారం ఏ సంగతీ చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పాదయాత్రకు సమయం లేకపోవడంతో ముందు రోజు అనుమతి తిరస్కరిస్తారా? అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం.
గతంలో తిరుపతికి చేపట్టిన పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత పాదయాత్రపై 65 కేసులు కూడా నమోదయ్యాయని వివరించారు. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులని అమరావతి పరిరక్షణ సమితి తరపు న్యాయవాది అన్నారు. ఇదిలావుంటే, హైకోర్టు మాత్రం.. గురువారం సాయంత్రంలోపు అనుమతి విషయమై తమకు చెప్పాలని కోర్టు సూచించింది. లేదంటే శుక్రవారం ఉదయాన్నే మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరువైపు వాదనలు విని నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.