సీఎం జగన్ అప్పులు…దానికోసం ఆయన పడుతున్న తిప్పలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదలు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారని, త్వరలోనే ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పలుమార్లు విమర్శించారు. అయినా సరే, ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసిన జగన్..అప్పుల కోసం మాత్రం అన్వేషిస్తూనే ఉన్నారు. జగన్ అప్పులపై కాగ్ కూడా పలుమార్లు మొట్టికాయలు వేసినా సరే ఫలితం లేకపోయింది.
మూడున్నరేళ్లలో జగన్ రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, కానీ, ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధీ జరగలేదని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. వసూలు చేస్తున్న పన్నుల సొమ్ము ఎటు పోతోందో లెక్క లేదని, అప్పులకు, ఆదాయానికి సంబంధం లేదని మండిపడుతున్నారు. ఏపీ చేసిన అప్పులకు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని, ఇది లక్ష కోట్లకు చేరే అవకాశముందని, ఈ భారమంతా ప్రజలపై పడుతోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయినా సరే, ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు తాజాగా మంగళవారం మరో రూ.1,413 కోట్ల రుణాన్ని సేకరించడం సంచలనం రేపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలోని సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సేకరించింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలంలో జగన్ సర్కార్ పాల్గొంది. మొత్తం రుణంలో రూ.700 కోట్లను ఏడేళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీతో సేకరించించగా, రూ.713 కోట్లను 11 ఏళ్ల కాల వ్యవధికి 7.86 శాతం వడ్డీకి సేకరించింది. దీంతో, అప్పుల అప్పరావుగా మారిన జగన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.