టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యక్తిగత స్థాయిలో దూషణలకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు…టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన బీఏసీ సమావేశంలో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు…చంద్రబాబు కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడంపై సీఎం జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. మీరు నా కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలు చేయడం మానేస్తే, ఆటోమేటిక్ గా వైసీపీ నేతలు కూడా కామెంట్ చేయడం ఆపేస్తారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఏసీ సమావేశంలో సీఎం జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తే సహించమని మంత్రులు బుగ్గన, జోగి రమేష్ లు అచ్చెన్నతో అన్నారు.
ఈ సందర్భంగా జగన్ కల్పించుకొని అచ్చెన్నాయుడితో మాట్లాడారు. మనం రాజకీయ నాయకులం…మనం వంద అనుకుంటామని జగన్ అన్నారు. తాము కుటుంబాల జోలికి రావాలనుకోవడం లేదని, కానీ మా కుటుంబాల జోలికి మీరు రావడంతోనే వైసీపీ నేతలు స్పందించాల్సి వస్తోందని తమ నేతల వ్యాఖ్యలను జగన్ సమర్థించారు. ఇక, సభలో టీడీపీ నేతలు, వైసీపీ నేతలు చర్చించబోయే, లేవనెత్తబోయే అంశాలు ఒకటేనని జగన్ అన్నారు.
అన్ని విషయాలపై చర్చిద్దామని, కావాల్సినన్ని రోజులు చర్చిద్దామని చెప్పారు. రాజధాని అమరావతిపై, మూడు రాజధానులపై చర్చిద్దామని, కావాలంటే ఈఎస్ఐ స్కాంపై కూడా చర్చిద్దాం అంటూ అచ్చెన్నను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు. దీంతో, జగన్ తాజా కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వైసీపీ నేతలను ఖండించాల్సిన జగన్ వారిని సమర్థించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఒక పార్టీ అధినేత నేత ఇలా అసభ్యకర భాషను సమర్థిస్తే ఇక నేతలు మరింత రెచ్చిపోతారని మండిపడుతున్నారు. జగన్ చెప్పిన నీతి సూత్రాలు మాజీ మంత్రి కొడాలి నాని తదితర నేతలకే వర్తిస్తాయని, వారికే జగన్ చెప్పుకోవాలని అంటున్నారు.