2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది…ఏపీ ప్రజలు మొదలు జాతీయ మీడియా వరకు అంతా ఇదే అనుకుంటున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం తాను ఓడిపోలేదని చెబుతున్నారు. అంతే కాదు తన పార్టీ నేతలతో కూడా న్యాయం, ధర్మం ప్రకారం వైసీపీ ఓడిపోలేదని జగన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ మెటీరియల్ గా మారాయి.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏనాడూ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించని జగన్…ఎన్నికల్లో ఓడిపోయిన పది రోజుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంపై ట్రోల్స్ వస్తున్నాయి.
అనేక పథకాలిచ్చినా..ఇంటింటికీ సంక్షేమాన్ని అందించినా పరాజయం తప్పలేదని జగన్ వాపోయిన వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రజలకు లబ్ధి, సంక్షేమ ఫలాలు అందించినా కూడా ఈ ఫలితాలు రావడంపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఫలితాలు శకుని మాయా పాచికలని, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడలేమని జగన్ చెప్పడంపై సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి.
ఓటమి భావనను తొలగించాలని, న్యాయంగా, ధర్మంగా చూస్తే వైసీపీ ఓడిపోలేదని జగన్ అనడంపై నెటిజన్లు మీమ్స్ తో పండగ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ వైసీపీ చేసిన మంచి ఉందని, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలమని జగన్ చెబుతున్న మాటలు ట్రోల్ మెటీరియల్ అయ్యాయి. కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం వ్యక్తమవుతుందని, 2029 నాటికి ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేయడం ఆ కామెంట్స్ కే కొసమెరుపు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ భ్రమ నుంచి బయటికెప్పుడొస్తావు జగన్? అని సెటైర్లు వేస్తున్నారు.