వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో ఎక్కడ కూర్చున్న ఒకటే. ఇప్పుడు ఈ సామెతను సీఎం జగన్ అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రయోజనాల కోసం అనంతపురం జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. కొడికొండ -మేదరమెట్లకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే(332 కి.మీ.)నే ఇందుకు నిదర్శనం.
రాయలసీమ నుంచి అమరావతికి చేరుకునేలా నిర్మించతలపెట్టిన అనంతపురం-అమరావతి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (384 కి.మీ.)ను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టి.. తమకు అంటే పులివెందులకు అనుకూలంగా ఉండేలా కొడికొండ నుంచి మేదరమెట్లకు రహదారికి పచ్చజెండా ఊపారు. దీనిపై అనంతపురం జిల్లా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొడికొండ-మేదరమెట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి కొత్త ప్రాజెక్ట్ అని అధికారులు చెబుతున్నారు. అయితే అనంత-అమరావతి ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసి కొత్త ప్రాజెక్టు తెచ్చుకున్నట్లు అయిందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనంతపురం జిల్లా కొడికొండ నుంచి కడప జిల్లా మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయరహదారి(16)లో కలిపేలా రూపొందించిన ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి జాతీయ రహదారుల శాఖ (ఆర్టీహెచ్) ఆమోదం తెలిపింది.
ఈ రహదారి పులివెందుల మీదుగా వీరపునాయినిపల్లి మండలం అనిమెల, మైదుకూరు, పోరుమామిళ్ల వద్ద మల్లేపల్లి, ప్రకాశం జిల్లా వంగపాడు, కనిగిరి మీదుగా మేదరమెట్లకు సమీపంలోని ఎన్‌హెచ్-16లో కలిపేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీంతో 384 కి.మీల రహదారిని కాస్తా.. 332 కి.మీలకు కుదించారు.
మొత్తం రూ.16వేల కోట్లతో రహదారి నిర్మాణం, భూసేకరణ చేసేందుకు అంచనా వేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ రహదారి నిర్మాణంపై కేంద్ర పలు సూచనలు చేసింది. మధ్యలో మల్లేపల్లి నుంచి గిద్దలూరు, నూజెండ్ల మీదుగా చిలకలూరిపేటకు ప్రతిపాదించిన మరో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇది అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేలోని కొంతభాగంలో వెళ్తుందని అధికారులు వివరించారు. ఈ రహదారి కోసం చేపట్టిన భూసేకరణ కూడా కొలిక్కి వచ్చిందని కేంద్ర అధికారులు వివరించారు.
కేంద్ర ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి పులివెందులకు సమీపం నుంచి వెళ్లే కొడికొండ-మేదరమెట్ల మార్గానికే గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో 332 కి.మీ. మేర నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, భూసేకరణకు కలిపి మొత్తం రూ.16వేల కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఇది కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే అయినప్పటికీ బెంగళూరు-విజయవాడకు సంబంధించిన 518 కి.మీ. రహదారిగా పేర్కొనడం గమనార్హం. బెంగళూరు నుంచి కొడికొండ వరకు ఉన్న 73కి.మీల ఎన్‌హెచ్-44, అటు కొడికొండ-విజయవాడ జాతీయరహదారి-16లోని 113 కి.మీలు కలిపి మొత్తం 518 కి.మీల ప్రాజెక్ట్‌గా పేర్కొనడంపై నిపుణులు నిర్ఘాంత పోయారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమను రాజధాని అమరావతికి అనుసంధానం చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మిగులుతోంది.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మర్రూరు నుంచి అమరావతి పరిధిలోని పెదపరిమి వరకు 385 కి.మీ. పొడవున.. ఎలాంటి మలుపులు లేకుండా ఉండేలా రహదారిని డిజైన్ చేశారు. దీనికి కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్లు రూపొందించారు.
కేవలం 6 గంటల వ్యవధిలోనే అనంతపురం నుంచి అమరావతికి చేరుకునేలా గంటకు కనీసం 100 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 2,236 హెక్టార్ల పట్టా భూములను గుర్తించి 3డి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. వీటికి పరిహారం చెల్లించి భూములు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 19 ప్యాకేజీల డీపీఆర్‌ల తయారీలో గతంలో 12 వరకు పూర్తి చేశారు. ఏమైందో ఏమో కాని ఆ తర్వాత ఆగిపోయాయి.