సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం సినీ థ్రిల్లర్ ను తలపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లగా నత్తనడకన సాగుతున్న ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు వస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి..అరెస్టు అవుతారనుకుంటున్న తరుణంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక, ఈ కేసులో వివేకా సూసైడ్ నోట్ కు నిన్ హైడ్రిన్ టెస్ట్ చేసేందుకు తాజాగా సీబీఐ కోర్టు అనుమతినివ్వడడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైసీపీకి 30 మంది ఎంపీలున్నారని, అవినాష్ రెడ్డిని కాపాడటం తప్ప వారికి వేరే పని లేదని అన్నారు.
కర్నూలులో ఆస్పత్రి దగ్గర సీబీఐని వైసీపీ గూండాలు అడ్డుకోవడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని అన్నారు. వివేకా కేసులో అలుపెరుగని పోరాటం చేస్తున్న సునీత అభినందించాలని అయ్యన్న అన్నారు..ప్రజలంతా సునీతకు మద్దతుగా నిలవాలని కోరారు. ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఘనత దేశ చరిత్రలో జగన్ కే దక్కుతుందని అయ్యన్న చురకలంటించారు.