ప్రస్తుతం ప్రపంచానికి సవాలుగా మారిన కరోనా రెండోదశలో ఎక్కడికక్కడ దేశాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రధానులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు సైతం ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ముందుగా మాస్కు ధరిస్తున్నారు. ఇక, సాధారణ ప్రజలకు మాస్కులు ధరించాలని నిత్యం ఏదో ఒక రూపంలో సందే శం పంపిస్తున్నారు. ఇక్కడ మనదేశంలోనూ మాస్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. మాస్కును మించిన మహా ఔషధం కరోనాకు లేదని.. ప్రధాని నుంచి మంత్రులు, వైద్యులు అందరూ చెబుతున్నారు. ఇక్కడ ఏపీలోనూ మాస్కులు ధరించాలని.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు హితవు పలికారు.
అంతేకాదు.. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే జనాలపై రూ.100 చొప్పున ఫైన్ విధించాలని.. కూడా ఆదేశించారు. ఇంతవరకు బాగానేఉన్నా.. మరి ముఖ్యమంత్రి మాస్కు ధరిస్తున్నారా? అంటే.. లేద నే అంటున్నారు నెటిజన్లు. ఎప్పుడో అమావాస్యకు పున్నమికి తప్ప.. ఆయన ఎక్కడా మాస్కు ధరించిన పాపాన పోలేదు. ప్రతిరోజూ.. అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. సమావేశాలు పెడుతున్నారు. కానీ.. ఆయన మాత్రం మాస్కు పెట్టుకోరు. మరి ఆయనకు ఫైన్ విధించరా.. అంటూ.. ఇప్పటికే అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపరంను కొనసాగించారు.
ఇక, ఇదే పరిస్థితి ఎదురైన ధాయ్‌లాండ్ ప్రధానికి అక్కడి అధికారులు భారీ జరిమానా విధించారు. అది కూడా.. అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు ఆరు వేల భాట్ల(సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి థాయ్ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది.
బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం.. రాజధానిలోని ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్లు(రూ.47,610) జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయమై సలహాదారులతో ప్రధాని ప్రయూత్.. సమావేశమ య్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకా క్ గవర్నర్ ఆశ్విన్ క్వాన్ ముయాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు.
కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడం వల్ల ప్రయూత్‌కు అధికారులు జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అంతేకాదు.. అక్కడ ప్రధానిని చూసైనా.. ఇక్కడ జగన్‌కు ఫైన్ వేయాలని అంటున్నారు నెటిజన్లు. మరి ఇంత సాహసం చేసే అధికారి ఎవరైనా ఉన్నారా? చూడాలి!!