“రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ దళిత సామాజిక వర్గం ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పు జగన్ “ అంటూ.. ఆయన సోదరి.. కాంగ్రె స్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రస్తుతం అరకులోయ నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. ఇక్కడి గిరిజను లతో భేటీ అయ్యారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు, సంక్షేమ సొమ్ము వంటివాటిని ఆరా తీశారు. ఈ క్రమంలో కొందరు.. తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా షర్మిల.. మూడు పేజీల లేఖను సీఎం జగన్‌కు సంధించారు. దీనిలో ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు.
చంద్రబాబు పథకాలు ఏమయ్యాయి?
రాజ్యాంగ బద్ధంగా వారికి దక్కాల్సిన ఆస్తులను, హక్కులను కూడా జగన్ సర్కారు లాగేసుకుందని షర్మిల ఫైరయ్యారు. ఎస్సీల పైనే ఎస్సీ , ఎస్టీ కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన 28 ఎస్సీ, ఎస్టీ పథకాలను ఎందుకు నిలుపుదల చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిద్ర పోయిందని విమర్శించారు. కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదన్నారు. అంతేకాదు.. అసలు దాడులు చేసిందే వైసీపీ మూకలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా ఎస్సీలు.. నయ వంచన!
“నోరు విప్పితే.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ.. చెబుతారు కదా మీరు. కానీ, ఇదంతా నయవంచన. అధికారంలోకి వచ్చేందు కు ఎస్సీలపై ప్రేమ కురిపించారు. తర్వాత.. వారిపైనే దాడులకు తెగబడ్డారు. దళిత డ్రైవర్‌ను చంపేసి.. డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన నిలబెట్టుకున్నారు. డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్రవేసి మానసికంగా వేధించి చంపేశారు“ అని షర్మిల నిప్పులు చెరిగారు. హత్యలు చేసేవారిని, గూండాయిజాలు చేసేవారిని నెత్తికెక్కించుకునే లక్షణం జగన్‌లో నరనరాన నిండిపోయిందని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఒకమాట.. తర్వాత.. మరో మాట చెప్పే వారిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు.