అధికార పార్టీ అండదండలున్నాయి కదా అని కొందరు ఉన్నత స్థాయి అధికారులు తమ తోటి అధికారులపై సైతం అజమాయిషీ చేయాలని చూస్తుంటారు. సీఎం, సీఎస్ తర్వాత అన్నీ తానే అన్నట్టు సీఎం పేషీలో పెత్తనం చలాయిస్తుంటారు. అంతేకాదు, అయితే, ఎవరి ఆటైనా సాగినంత కాలమే సాగుతుంది. కాలం ఖర్మం కలిసిరాకపోతే….ఆ తర్వాత ఆ అధికారాలకు కత్తెర వేయక తప్పని పరిస్థితి వస్తుంది.
కొద్దిరోజులుగా సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పై ఈ తరహా విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంతేకాదు, ఆయన రాష్ట్రం నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఢిల్లీలో చక్కర్లు కూడా కొడుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు కత్తెర పడిందని టాక్ వస్తోంది. సీఎం ముఖ్య కార్యదర్శి, జీఏడి పొలిటికల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రవీణ్ ప్రకాశ్ కు జగన్ షాకిచ్చారని తెలుస్తోంది.
జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న రేవు ముత్యాలరాజుకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారశైలి బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది. ప్రవీణ్ నిర్ణయాల వల్ల కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న వైనంపై కూడా జగన్ ఫోకస్ పెట్టారట.
దీంతో, ప్రవీణ్ అధికారాలకు కత్తెర వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఏపీభవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్ త్రిపాఠి జులై నెల చివరలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ ప్లేస్ కు ప్రవీణ్‌ప్రకాశ్ ను పంపాలన్న యోచనలో కూడా ఏపీ సర్కార్ ఉందట. ఈ ప్రకారం ప్రవీణ్ కూడా ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే, హఠాత్తుగా ప్రవీణ్ అధికారాలకు కత్తెర వేయడంపై చర్చ జరుగుతోంది.