ఏపీలో టీడీపీ నేత పట్టాభిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడుల వ్యవహారం జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతిపక్ష పార్టీపై ఈ తరహా దాడులు చేయడం ఏమిటని జాతీయ మీడియాలోనూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ కనుసన్నల్లోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులను ఏపీలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దాడులపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేతలు, కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను జగన్ సమర్థిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని, అది చూసి తట్టుకోలేకే తమ పార్టీ అభిమానులు దాడులు చేశారని జగన్ బాహాటంగా దాడులను ప్రోత్సహించేలా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రతిపక్ష నేతలు తిట్టే బూతులు వినలేక…తమపై ఆప్యాయత చూపే అభిమానులు… బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని జగన్ వ్యాఖ్యానించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే ప్రభుత్వాన్ని దారుణంగా కొందరు నేతలు బూతులు తిడుతున్నారని జగన్ ఆ దాడులను సమర్థించేలా వ్యాఖ్యానించారు. ఇలాంటి బూతులు గతంలో ఎప్పుడూ వినలేదన్న జగన్….తమ నేతలను కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నాని, కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
వ్యవస్థలను కూడా మ్యానేజ్ చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని దాడుల వ్యవహారాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టే ప్రయత్నం చేశారు. అభివృద్ధి పనులను కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. దాడులు చేసిన వైసీపీ శ్రేణులను హెచ్చరించాల్సిన జగన్…ఇలా దాడులను మరింత ప్రోత్సహించేలా వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి.