అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే ఇటు విపక్షం నుంచే కాదు అటు స్వపక్షం నుంచి కూడా విమర్శలు వస్తాయి. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ లు ఇవ్వడం, ఆ అధికారులు తమ స్వామిభక్తిని చాటుకునే క్రమంలో ఉన్నతాధికారులను సైతం లెక్కచేయకపోవడం వంటి వ్యవహారాలు గతంలో చాలా జరిగాయి. అయితే, ఇటువంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి డ్యామేజి జరుగుతుందనుకుంటే మాత్రం ఆ అధికారిపై చర్యలు తీసుకొని సదరు ఎమ్మెల్యేకు షాకిచ్చిన ఘటనలు అనేకం. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి జగన్ ఇచ్చిన షాక్ కూడా ఈ కోవలోకే వస్తుందన్న చర్చ మొదలైంది.
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధా…ఎమ్మెల్యే రాచమల్లు అండ చూసుకుని అధికారం చలాయించేవారని విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తన వెనుకున్నారన్న కారణంతో రాధా నియంతృత్వ ధోరణితో, లెక్కలేనితనంతో వ్యవహరించేవారని సాక్ష్యాత్తూ వైసీపీ కౌన్సిలర్లే అసంతృప్తితో ఉన్నారట. దీంతో, రాధపై సర్కార్ కు పలువురు వైసీపీ నేతలే ఫిర్యాదు చేశారట. 6 నెలల క్రితం ప్రొద్దుటూరులో టీడీపీ బీసీ నాయకుడి హత్య కేసులో రాధ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో జరిగే అనేక పనుల్లోనూ ఆమె అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారట.
దీంతో, తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ అధిష్టానం…రాధను బదిలీ చేసింది. దీంతో, ఎమ్మెల్యే రాచమల్లుకు చెక్ పెట్టినట్టైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల కాలంలో ఒక్క సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు కూడా రాధ సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. మరో మూడేళ్ల పాటు ప్రొద్దుటూనులోనే రాధ కమిషనర్‌గా కొనసాగాలన్న రాచమల్లు ఆకాంక్ష నెరవేరలేదని స్థానికులు అనుకుంటున్నారు. అయితే, కమిషనర్ బదిలీకి వేరే కారణాలున్నాయని చెబుతున్నప్పటికీ….ఎమ్మెల్యే రాచమల్లును కట్టడి చేయడానికే జగన్ ఇలా చేశారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి, ఈ వ్యవహారంపై రాచమల్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.