జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు…వారంతా నానా తిప్పలు పడుతున్నారు…అప్పులకు వడ్డీలు కట్టలేక అగచాట్లు పడుతున్నారు…అందుకే కొత్త టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదట… టీడీపీ హయాంలోనే నయం…ఓ నెల అటో ఇటో బిల్లులు వచ్చేవి…ఈ మాటలన్నీ ఏ కాంట్రాక్టరో, టీడీపీ నేతో, కార్యకర్తో, అభిమానో అన్నాడనుకుంటే పొరపాటే. ఈ మాటలంటోంది జగన్ కు ఓటు వేసి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన అశేషాంధ్ర జనం.
మొన్నటి వరకు బిల్లుల విషయంలో ప్రతిపక్షాలది రాజకీయం అనుకున్నారు జనం. కానీ, మెల్లమెల్లగా జనం కళ్లకు జగన్ కప్పిన పథకాల పరదాలు తొలగిపోతున్నాయి. దీంతో, జనం కళ్లు తెరిచి జగన్ పాలనపై ప్రతిపక్షాలు, కాంట్రాక్టర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ప్రతిపక్షాలు మొత్తుకుంటోన్న దానికంటే దారుణంగా ఉందని గ్రహిస్తున్నారు. అంగన్ వాడీ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్…వైఎస్సార్ జలకళ సంఘం బోర్ వెల్స్ ప్రతినిధులు…స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ వరకు అందరూ ఆందోళన బాటపట్టారు. ఇక, మరికొందరు కాంట్రాక్టర్లైతే తమ బిల్లులు చెల్లించడం లేదంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
దీంతో, జగన్ సర్కార్ కు గర్వభంగమైంది. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్టర్లందరికీ జగన్ సర్కార్ తాజాగా మరో హుకుం జారీ చేసింది. పోకిరిలో ప్రకాష్ రాజ్ లాగా…గిల్లితే గిల్లిచ్చుకోవాలి…నొప్పి అనకూడదు అన్న రీతిలో….మా ఇష్టమొచ్చినప్పుడు డబ్బులిస్తాం…ఈ లోపు కోర్టుకెళ్లకూడదు…అంటూ ఏకంగా టెండర్ డాక్యుమెంట్ లో ఒక నిబంధన పెట్టింది.
కృష్ణా జిల్లాలో కాలువలకు సంబంధించిన రూ.13 కోట్ల విలువైన మరమ్మతు పనులు చేపట్టాలని జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. జూన్ 6లోపు టెండర్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. అయితే, అసలు తిరకాసు ఇక్కడే ఉంది. టెండరు డాక్యుమెంట్లో ‘స్పెషల్ కండిషన్ ఆఫ్ నోట్’ అంటూ…పెట్టిన ఓ నిబంధన చూసి కాంట్రాక్టర్లు షాకయ్యారు.
‘‘బాగా అదనపు నిధులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. బిల్లుల చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే… కాంట్రాక్టు సంస్థకు కోర్టుకు వెళ్లే హక్కు ఉండదు. కోర్టును ఆశ్రయించకుండా, బిల్లులు చెల్లించేదాకా వేచి చూసే కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులకు టెండర్లు దాఖలు చేయాలి’’ అంటూ జలవనరుల శాఖ పెట్టిన నిబంధన చూసి కాంట్రాక్టర్ల ఫీజులు ఎగిరిపోయాయి. సొంత డబ్బులతో కాలువలకు మరమ్మత్తులు చేసి, ఆ తర్వాత బిల్లుల చెల్లింపు కోసం కళ్లు, కాళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉండాలన్నమాట.
బిల్లుల చెల్లింపులో ఆలస్యం ఎందుకైంది…కారణాలేమిటి అని మాత్రం కోర్టుకెళ్లి ప్రశ్నించకూడదు. అయితే, ఈ టెండరు డాక్యుమెంట్ జిల్లా స్థాయిలో రూపొందించినప్పటికీ..ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ ‘షరతు’ విధించినట్లు తెలుస్తోంది. ఏఫీ ఆర్థిక దుస్థితి ఎంత ఘోరంగా ఉందో ఈ ఒక్క షరతు చూస్తే ఇట్టే అర్థమవుతోంది.