తమకు రాష్ట్రంలోని 3 ప్రాంతాలు మూడు కళ్లవంటివని, అందుకే విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, విశాఖ లో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేయడానికే వైసీపీ నేతలు విశాఖపై వల్లమానిన ప్రేమను వలకబోస్తున్నారని టీడీపీ సహా విపక్ష నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు.
విశాఖలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రుషికొండ, దసపల్లా భూముల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలను ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు. 3 రాజధానులు అంటూ విశాఖలో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి రూ.40 వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు. విశాఖ స్టీల్ ను బేరం పెట్టి వాటాలు పంచుకున్నారని, ఇప్పటికైనా కామెడీలు చేయడం అప్పులతో కుదేలైన ఖజానాను నింపే ప్రయత్నాలు చేయాలని హితవు పలుకుతున్నారు.
అయినా సరే, జగన్ అండ్ కో తీరు మారడం లేదు. విశాఖే ఏపీ రాజధాని అని, త్వరలో తాను విశాఖకు వెళ్లబోతున్నానని సీఎం జగన్ సుప్రీం కోర్టును ధిక్కరించి మరీ ప్రకటనలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ…జగన్ పై ధ్వజమెత్తారు. దోచుకోవడానికే విశాఖ రాజధాని అని జగన్ అంటున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అమరావతిని ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇక్కడ తనకేం వస్తుందని సీఎం అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖలో వడ్డించిన విస్తరిలాగా అన్నీ సిద్ధంగా ఉన్నాయని, అలాంటి నగరం అయితే దోచుకోవడానికి బాగుంటుందని జగన్ అనుకుంటున్నారని చురకలంటించారు.
అయితే, వైసీపీ నేతలను చూసి వైజాగ్ ప్రజలు భయపడుతున్నారని, బాబోయ్ మాకు రాజధాని వద్దు అంటున్నారని విమర్శలు గుప్పించారు. వైజాగ్ లో భూకబ్జాలు, చెప్పలేనన్ని దారుణాలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అమరావతి విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని అంతా అనుకుంటున్నారని, కానీ, 3 రాజధానులకు నిధుల కోసం వెళ్లినప్పుడు కేంద్రం తగిన రీతిలో స్పందిస్తుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇపుడు తాను అన్న మాటే నిజమైందని, ఏపీకి అమరావతి రాజధాని అని, మూడు రాజధానులపై తమ అనుమతిని జగన్ తీసుకోలేదని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారని అన్నారు.