ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కక్షపూరితంగా ప్రజావేదికను రాత్రికి రాత్రే కూల్చివేయడం మొదలు…తాజాగా తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడం వరకు….ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఘనత జగన్ కే దక్కింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాలను, పేర్లను మార్చకూడదని ఎవరెన్ని చెప్పినా…తాను చేయాలనుకున్నది మాత్రమే చేసే జగన్…తాజాగా తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమైంది.
సాధారణంగా ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీ. అలా జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం రావడం తమకు దక్కిన గౌరవంగా వారు భావిస్తుంటారు. అయితే, వారికి ఆ కొద్దిపాటి ఆనందాన్ని దూరం చేస్తూ జగన్…సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆనవాయితీకి తిలోదకాలిచ్చిన జగన్…ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటి ఛైర్మన్లతో జెండా ఎగురవేయించాలని నిర్ణయించారు. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలతోనే జెండా ఎగురవేయించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లతో జెండా వందనం చేయించాలన్న నిర్ణయం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్, ఎంపీటీసీలకు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని , వాటికి తిలోదకాలిచ్చేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్లకు వ్యతిరేకంగా నిధులు, విధులు, అధికారాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశారని, చట్ట వ్యతిరేకంగా జీవోలు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జగన్ సర్కార్ అనాలోచిత జీవోలు అమలైతే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.