ఏపీలో ఇప్పుడు ‘సింగిల్’ రాజకీయం నడుస్తుంది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ వైసీపీ నేతలు ఒక రేంజ్ లో చెలరేగిపోతున్నారు. జగన్ సర్కారు వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేయటంతో వైసీపీ పరివారం మొత్తం పవన్ మీద విరుచుకుపడటం షురూ చేసింది.
ముసుగు తొలిగిందని ఒకరు.. మీరెంతమంది కలిసి వచ్చినా మా సింహం సింగిల్ గానే వస్తుందని ఇంకొకరు.. బాబు కోసం పవన్ ఎంత తహతహలాడిపోతున్నారో అంటూ మరొకరు ఇలా.. వైసీపీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైనంపై జనసైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా తమ అధినేత పవన్ కల్యాణ్ చెప్పేస్తున్నారని.. వైసీపీ కేసీఆర్ , బీజేపీలతో పెట్టుకున్నట్టు వారి మాదిరి రహస్య సంబంధాలు తమకు లేవని రొమ్ము విరిచి చెబుతున్నారు జన సైనికులు. సింహం సింగిల్ గా వస్తుందంటూ మాటలు చెప్పే వైసీపీ నేతల బతుకులు తమకు తెలీవా? అంటూ వారు విరుచుకుపడుతున్నారు.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు రావటం వెనుక జగన్ మొనగాడితనం కంటే కూడా.. రహస్య శక్తులు పని చేసిన విషయం ఏపీలో ఎవరికి తెలీవు అంటూ మండిపడుతున్నారు. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ జగన్ కు అవసరమైన అన్ని పనులు చేయటంతోనే జగన్ గెలుపు సాధ్యమైందే తప్పించి.. మామూలుగా అయితే కాలేదు కదా? ఆ విషయాన్ని మర్చిపోయి.. ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడే వైసీపీ నేతలకు నిజాన్ని నిజమని చెప్పుకునే ధైర్యం కూడా లేదంటూ జనసైనికులు స్పష్టం చేస్తున్నారు.
తమ అధినేతకు చీకటి ఒప్పందాలు ఉండవని.. ఏదైనా సరే మొహమాటం లేకుండా.. ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొడతారని.. తమ అధినేతతో పోలిస్తే నిజాయితీలో జగన్ ఒక్క శాతమైనా పోలిక ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీకి చెందిన ఎంతోమంది నేతల ఆస్తులు హైదరాబాద్ లో ఉండటం.. వాటిని బూచిగా చూపించి జగన్ తరఫు పని చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించి ఉండకపోతే.. జగన్ గెలుపు ఇంతలా ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల సమయానికి తెలంగాణ నుంచి ఎంతటి సహాయ సహకారాలు అందాయన్నది వైసీపీ నేతలు మర్చిపోవచ్చు కానీ.. ప్రజలు మర్చిపోలేదంటున్నారు. అంతదాకా ఎందుకు? ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారుతో జగన్ సర్కారుకు ఉన్న సంబంధం గురించి.. వారి రహస్య అనుబంధం గురించి మాట్లాడే దమ్ముందా? అని జనసైనికులు మండిపడుతున్నారు.
మోడీ ప్రభుత్వంతో జగన్ సర్కారుకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. మూడు వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకించే విషయంలో కానీ.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తింటున్న వేళలోనూ.. మోడీ సర్కారుతీరును కడిగిపారేసే దమ్ము.. ధైర్యం సింగిల్ గా వచ్చినట్లు చెప్పే సింహం లాంటి జగన్ కు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో పులిలా, ఢిల్లీలో పిల్లిలా ఉంటూ ఆంధ్రను మోడీకి తాకట్టు పెట్టే వైసీపీ వాళ్లు ఇన్ని ముసుగులు పెట్టుకొని.. ‘సింగిల్’ అనే మాట వైసీపీ నేతల నోటి నుంచి వస్తుంటే వినేందుకు చికాకుగా ఉండటమే కాదు.. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం అవసరమా? అని జనసేన నిలదీస్తోంది. మరి.. ఈ లోగుట్టు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అన్న మాటకు వారేం బదులిస్తారో?