కట్టుబట్టలతో ఉమ్మడిరాజధాని నుంచి అమరావతికి వచ్చేసిన పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి నాటీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు నిర్విరామంగా శ్రమించారు. ఒక్క అమరావతే కాదు..దాని చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ కావాలన్న ఉద్దేశ్యంతో విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి మహా నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
అందుకు అనుగుణంగానే ఆ నగరాలను కలుపుతూ చుట్టూ 189 కి.మీ.ల పొడవైన ఓఆర్ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి. నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించేందుకు కేంద్రం కూడా అంగీకరించింది. ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ కూడా రెడీ అయింది. ఇక, భూసేకరణ జరిపి …ప్రాజెక్టు ప్లాన్ వగైరాలు రూపొందించి పని మొదలుబెట్టడమే తరువాయి.
కట్ చేస్తే…. జగన్ సీఎం అయ్యారు. అమరావతి రాజధానిపై రివేంజ్ తీర్చుకుంటున్నారు. అసలు మాకు ఓఆర్ఆర్ వద్దంటూ ఏకంగా కేంద్రానికి జగన్ తేల్చి చెప్పేశారు. రాజ్యసభలో శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని స్వయానా కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. ఇక, ఓఆర్ఆర్కి బదులుగా జగన్… 78 కి.మీ.ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు కావాలని కోరారట.
ఓఆర్ఆర్తో అనుసంధానం వల్ల 40 మండలాల పరిధిలోని ఎన్నో ఊళ్లు డెవలప్ అవుతాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో రవాణా మరింత మెరుగుపడి వ్యాపారం పెరుగుతుంది. 425 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్లో ఓఆర్ఆర్ నిర్మించాక గత పది పన్నెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. ఇక, తెలంగాణలో అభివృద్ధిని మరింత విస్తరింపజేసేందుకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే…ఏపీలో మాత్రం…ఓఆర్ఆర్ కూడా వద్దనడం విడ్దూరం.
ప్రపంచంలో చాలా దేశాలు ఓఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ లు వేసుకొని డెవలప్ మెంట్ లో దూసుకుపోతోంటే జగన్ మాత్రం అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.
జగన్ కు ఓఆర్ఆర్…ఆర్ఆర్ఆర్ లతో పనిలేదని, రాజధాని అమరావతి తో పనిలేదని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాలతో అస్సలు పనిలేదని విమర్శలు వస్తున్నాయి.
జనాలకు సంబంధించిన వైద్య, విద్య, ఆరోగ్యం వంటి విషయాలు జగన్ కు పట్టవని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బెయిల్ రద్దు కాకుండా తన వ్యాపారాలను సజావుగా జరుపుకోవడమే జగన్ కున్న ఏకైక కర్తవ్యం అని విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎంత నాశనమైతే జగన్ కు అంత మంచిదని, జగన్ కు సంబంధించిన ఆస్తులున్న హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆస్తుల విలువ పెంచేలా దోహదం చేయడమే జగన్ ఎజెండా అని దుయ్యబడుతున్నారు.