కాలం కట్లపాము కంటే ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తుంటారు కొందరు. కాలం బాగోకపోతే అప్పటివరకు కింగ్ లా ఉన్నోడు బొంగులా మారతాడని చెబుతారు. అందుకే.. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయాలి. తమ నోటి నుంచి వచ్చే మాటల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే లేని తలనొప్పులు ఖాయం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వ్యవహారం అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం తలనొప్పిగా మారిందని చెప్పాలి.
ఆరాచకానికి నిలువెత్తుగా.. తాలిబన్ తరహాలో తనకు అడ్డం వచ్చిన వారి పట్ల కర్కశంగా వ్యవహరించే అతడి తీరు తొలిసారి కళ్లకు కట్టినట్లుగా వీడియో రూపంలో బయటకు వచ్చింది. పోలింగ్ వేళ.. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి.. ఈవీఎంను నేలకేసి బలంగా బద్ధలు కొట్టటమేకాదు.. అడ్డొచ్చిన వారికి వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోయిన వైనం చూస్తే.. ఇంత బరితెగింపా? ఆంధ్రాలో ఉన్నామా? అప్ఘనిస్తాన్ లో ఉన్నామా? అన్న సందేహం కలుగక మానదు.
పిన్నెల్లి లాంటి వివాదాస్పద నేతను పట్టుకొని వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ‘‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా. రామక్రిష్ణారెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’’ అంటూ జగన్ చెప్పిన మాటలు ఇప్పడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
వివాదాస్పద తీరుతో నిత్యం ఏదో ఒక పంచాయితీ పెట్టుకున్న పిన్నెల్లిని అంతలా పొగడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వివాదాలతో ముడిపడి ఉన్న నేతలను ప్రమోట్ చేసే బదులు.. ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్ని ప్రస్తావిస్తూ.. తనను చూసి ఓటేయాలని చెబితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు భిన్నంగా పిన్నెల్లికి కాండాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన వైనం సరికాదంటున్నారు.
ఈవీఎంను ధ్వంసం చేసిన వైనానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిన తర్వాత జగన్ మాటల్ని ప్రస్తావిస్తూ.. ‘‘పిన్నెల్లి రామక్రిష్నారెడ్డి మీకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఇలాంటి వ్యక్తులే మీకు స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదంటే మరింత పైస్థానాన్ని కల్పిస్తారా?’’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి తన తీరుతో పిన్నెల్లి తనకు తాను సమస్యల్లోకి చిక్కుకుపోవటమే కాదు.. అధినేతను కూడా చిక్కుల్లోకి నెట్టారని చెప్పక తప్పదు.