విశాఖలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో 10,742 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని జగన్ చెప్పారు. విశాఖలో ఓ వైపు సముద్రం మరోవైపు జనసంద్రం కనిపిస్తున్నాయని, ఈ సభకు ఉత్తరాంధ్ర ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారని జగన్ అన్నారు.
ఈ మూడేళ్లలో ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జగన్ చెప్పారు. మహిళల సాధికారత, విద్యా, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో పురోగతి సాధించామని జగన్ అన్నారు. గడప వద్దకే పాలన అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక, ఏపీకి పెద్ద మనసుతో ప్రధాని మోడీ ఎంతో చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా ప్రధాని మోడీతో తమకున్న అనుబంధం ఎంతో బలమైనదని జగన్ అన్నారు.
కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమైనదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలపై తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించాలని సభాముఖంగా మోడీని జగన్ కోరారు. రాష్ట్రానికి మోడీ చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని జగన్ చెప్పారు. పెద్దలైన మోడీ తమను ఆశీర్వదించాలని జగన్ అన్నారు.
ఇక స్టేజి మీదే జగన్ ప్రముఖ ప్రజాకవి గాయకుడు వంగపండును గుర్తు చేసుకున్నారు. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అంటూ సభాముఖంగా వంగపండు పాటను జగన్ పాడడం విశేషం. ఆయనతోపాటు మహాకవి శ్రీశ్రీని కూడా జగన్ గుర్తు చేసుకున్నారు.