వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వటాన్ని కమ్యునిస్టులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్ని లేవనెత్తి.. వాటిపై తమ వాదనను వినిపించి.. కేంద్రం నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా మద్దతు ఇస్తున్నట్లుగా చేసి ఉంటే బాగుండేదని.. అందుకు భిన్నంగా కేంద్రం చెప్పిన దానికి తలూపటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
రైతులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తప్పు పడుతున్నారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా రియాక్టు అయ్యారు. విద్యుత్ మీటర్లు పెట్టాలని ప్రధాని చెప్పలేదు కానీ తగదునమ్మా అంటూ బాంఛన్ దొర అన్నట్లుగా మీటర్లు పెట్టిన జగన్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. తనను జైలుకుపంపొద్దన్నట్లుగా మోడీని జగన్ వేడుకున్నట్లుగా ఉందని చెబుతున్నారు.
వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చిన జగన్ కు పుట్టగతులు ఉండవన్న నారాయణ.. వ్యవసాయ బిల్లులతో సన్న చిన్నకారు రైతులు పంటల్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిని తీసుకొస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లుపై మోడీ సర్కారు తీరును ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.
సంసారం లేని మోడీకి చాలా విషయాలు తెలీవని.. పండించిన పంటను అమ్ముకోవటానికి ఎక్కడెక్కడో తిరగాలన్న మోడీ మాటలు.. సంపారం ఉండి పిల్లలు ఉన్న వారికి కొత్త కష్టంగా మారతాయని ఆయన పేర్కొన్నారు. ‘సంసారం లేని మోడీకి ఏం తెలుసు’ అంటూ విమర్శించిన నారాయణ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.