మాట తప్పను-మడమ తిప్పను.. ఇది వైసీపీ అధినేత, సీఎం జగన్ బ్రాండ్ కామెంట్! నిజమే.. అనడం తేలికే.. కానీ, నిలబెట్టుకోవడమే కష్టం. అందుకేనేమో.. ఆయనకు ఇప్పుడు ఇదే ప్రశ్నగా మారింది. అన్ని వైపుల నుంచి ఇదే ప్రశ్నగా మారి.. ఆయనకు ఎదురవుతోంది.
మరీముఖ్యంగా రాష్ట్రంలోని అవ్వాతాతలు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. “మాట తప్పనన్నాడు.. కానీ, ఇప్పుడు ఏం చేస్తున్నాడు?“ అనే ప్రశ్న.. రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఒకటో తారీకు రావడమే! గత ఏడాది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సామాజిక పింఛను దారులకు ఇచ్చే పెన్షన్‌ను తాను అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి ఏటా 250 రూపాయలు పెంచుతూ.. ఐదేళ్లు గడిచేసరికి 3000 రూపాయల వరకు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
దీంతో మెజారిటీ అవ్వాతాతలు.. ఒంటరి మహిళలు.. జగన్ వైపు మొగ్గు చూపారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ఓటు బ్యాంకు.. ఈ హామీతో తీవ్రంగా ప్రభావితమైందని తర్వాత వచ్చిన సర్వేలు అనేకం స్పష్టం చేశాయి. నిజానికి అప్పటి వరకు కేవలం 2000 మాత్రమే ఉన్న పింఛన్.. ఏటా రూ.250 చొప్పున పెరుగుతుందనడంతో.. వృద్ధుల మోముల్లో చిరునవ్వులు విరిశాయి. జగన్‌ను వారు ఏకపక్షంగా అభినందించారు. అంతేకాదు, జగన్ పదే పదే చెప్పిన.. మాట తప్పను.. అనే డైలాగును మనసారా నమ్మారు. అన్నమాట ప్రకారం నిలబడే.. వైఎస్ బిడ్డ అంటూ.. అనేక గ్రామాల్లో వృద్ధులు సైతం అప్పట్లో వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అప్పటి వరకు ఉన్న పింఛన్‌పై రూ.250 పెంచి ఇచ్చారు. దీంతో జగన్‌పై మరింత నమ్మకం ఏర్పడింది. కానీ.. ఇప్పుడు ఆయన అధికారం చేపట్టి రెండో ఏడాది కూడా సగం అయిపోయింది. ఈ ఏడాది మే 30 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు జగన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. ఐదు మాసాలుగా పింఛన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
కానీ, అవ్వాతాతలు మాత్రం తమకు పెంచి ఉంటారనే ఆశతో అధికారులతో నిత్యం వాదులాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటికే పింఛన్‌ను తీసుకునివెళ్తున్న వలంటీర్లను నిలదీస్తున్నంత పనిచేస్తున్నారు. “పెంచుతానన్నాడు.. పెంచకుండా ఎలా ఉంటాడు?“ అని ప్రశ్నిస్తుండడంతో వలంటీర్లు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా నవంబరు 1 ఆదివారమే అయినప్పటికీ.. చాలా చోట్ల ప్రతి ఇంటికీ వలంటీర్లు పింఛన్లను అందించారు. కానీ, పెంపు లేకపోవడం.. ఐదు మాసాలు గడిచి పోవడంతో ఇప్పుడు అవ్వాతాతలు ఉసూరు మంటున్నారు.
అంతేకాదు.. “అప్పుడే జగన్ మడమ తిప్పేశాడా?“ అంటూ.. ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దీనికి జగన్ ఏం చెబుతారు? ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల పేరుతో నిధులను పప్పుబెల్లాల్లా పంచేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
అయితే.. కేవలం పింఛన్ సొమ్ముపైనే ఆధారపడ్డ పండుటాకులు.. జగన్ మాటలు నమ్మి.. ఆయనకు ఓట్లేశారు. కానీ, ఇప్పుడు వారికే జగన్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఏం చెబుతారో చూడాలి.. ఎప్పటికి పెంచుతారో చూడాలి!!