ఎన్ఈపీ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ.. దీని ప్రకారం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా చదువులు చెబుతాం అని చెప్పి, మాతృభాషలో బోధనకు పాతరేసిన క్రమంలో టెన్త్ ఫలితాలు తరువాత పరిణామాలు, తాజా నిర్ణయాలు అన్నవి అయోమయ స్థితిలో ఉన్నాయన్న వాదన ఒకటి వివిధ విద్యా సంస్థల నుంచి, విద్యా వేత్తల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.
మున్సిపల్ స్కూల్ ఆస్తులపై జగన్ సర్కారు కన్నుపడిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా పాఠశాల విద్యలో వస్తున్న మార్పులు కారణంగా విద్యాశాఖ పరిధిలో మున్సిపల్ బడులను తీసుకువచ్చి, ఆస్తులను మాత్రం పురపాలక శాఖ పరిధిలో ఉంచుతారు. అంటే ఆయా ఆస్తుల నిర్వహణ లేదా లీజు పై అధికారం పులపాలక కమిషనర్లదే !
ఇక టీచర్లంతా విద్యాశాఖ పరిధిలోకి వెళ్తారు. జీతాలు కూడా విద్యాశాఖే ఇస్తుందా లేదా పురపాలక శాఖ ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేర్వేరు యాజమాన్యాల కింద టీచర్లు పనిచేస్తున్నారు. కొత్త విద్యా విధానం అంటూ ఏపీ సర్కారు హడావుడి చేస్తున్నది కనుక వీళ్లందరినీ ఒకే గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తే ఉపాధ్యాయుల సీనియార్టీలు ఏం కావాలి. పీఎఫ్ లు మిగతా వ్యవహారాలు ఏం కావాలి ? ఇంతటి గందరగోళం ఇప్పటికిప్పుడు అవసరమా ?
పైగా కొన్ని కార్పొరేట్ సంస్థలను టార్గెట్ గా చేసుకుని, వాటిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇంటర్ విద్యను కాస్త హై స్కూల్ పరిధిలోకి ఇంకా చెప్పాలంటే పాఠశాల విద్య పరిధిలోకి తేవాలన్న యోచన ఒకటి చేస్తున్నారు. అదేకనుక జరిగితే మరింత సమస్యలు తలెత్తడం ఖాయం.
ఈ లెక్క ప్రకారం ఇకపై ఇంటర్ బోర్డు అన్నది ఉండదు. దీనిని త్వరలోనే రద్దు చేయనున్నారు. అక్కడి సిబ్బందిని కూడా పాఠశాల విద్యకు సంబంధించిన కార్యాలయాలలోనే విలీనం చేస్తే చేయొచ్చు. ప్రస్తుతానికి జూనియర్ కాలేజీలు రేపటి వేళ ఉండకపోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మోజు పెంచుకుంటున్న ఇంగ్లీషు మీడియం చదువులు మున్ముందు మరిన్ని తప్పిదాలకు కారణం కావొచ్చు. ఇప్పటి ఫలితాలకు కారణం కూడా ఇంగ్లీషు మీడియం పిల్లలపై రుద్దడమే అని తెలుస్తోంది.
స్టేట్ సిలబస్ ప్రకారం పరీక్షలు జరిగినా ఇంగ్లీషు మీడియం కారణంగానే పెద్దగా బాగా రాయలేకపోయారన్న వాదన ఉంది. ఇది కాకుండా రానున్న కాలంలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకువస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తకమానవు.
ఇప్పటిదాకా చెబుతున్న మాట ప్రకారం ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ తీసుకువస్తే సమస్యలు తప్పవు. ఎందుకంటే సరైన విధంగా ఫౌండేషన్ బాగుంటేనే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ అన్నది తగని పని అన్న వాదన కూడా వినపడుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక విద్య ను బలోపేతం చేస్తేనే తరువాత ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావచ్చన్న వాదన బలీయంగా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఇంగ్లీషు మీడియం తీసుకున్న విద్యార్థులు అందులో ఇమడలేక అవస్థలు పడిన దాఖలాలూ ఉన్నాయి.