వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక… నిధులు లేకున్నా…. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ సాగిన వైనం అందరికీ తెలిసిందే. ఈ తరహా పాలనతో తన పాలనను సంక్షేమ రాజ్యంగా జనం అభివర్ణించాలని కూడా జగన్ కోరుకుని ఉండవచ్చు. అయితే తన వారిగా ముద్ర పడిన వారి కోసం తన కలలను కూడా జగన్ తుంచేసుకునేందుకు సిద్ధమేనని జగన్ చెప్పకనే చెప్పేశారు.
ఇందుకు నిదర్శనంగా ఇప్పుడు గ్రామాల్లోని పాడి రైతులంతా… తమ పాలను జగన్ సర్కారు రాష్ట్రానికి తీసుకువచ్చిన అమూల్ డెయిరీకే పోయాలంటూ హుకుం జారీ చేశారు. జగన్ స్వయంగానే మొదలెట్టిన ఈ బెదిరింపుల పర్వం… ఇప్పుడు జిల్లాలు దాటి క్షేత్రస్థాయికి కూడా చేరుకుంది.
ఈ తరహా బెదిరింపుల పర్వంతో జనం బెంబేలుపెడుతున్న వైనం ఆసక్తికర చర్చకు తెర లేపింది. అంతేకాకుండా జగన్ తన వాళ్ల కోసం… తనకు లబ్ధి చేకూర్చే వారి కోసం ఎంత దిగజారి అయినా వ్యవహరించేందుకు సిద్ధమేనని ప్రకటించినట్టైందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
ఈ దందాలో అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే… రాష్ట్రంలో సహకార రంగంలోని విజయా డెయిరీతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకమైన ధరను ఇస్తున్నా… వాటిలో పెద్దగా తేడా లేదనే చెప్పాలి. అయితే జగన్ సీఎం అయ్యాక… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ డెయిరీని టార్గెట్ ను వైసీపీ సర్కారు టార్గెట్ చేసింది.
జగన్ మార్గనిర్దేశకత్వంలో పకడ్బందీగానే సాగిన ఈ తంతులో గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయా డెయిరీతో పాటు ఇతర ప్రైవేట్ డెయిరీలు ఇస్తున్న ధర కంటే తాము లీటర్ కు రూ.5 నుంచి రూ.7 దాకా అధిక ధర చెల్లిస్తామని కూడా అమూల్ ప్రకటించింది.
ఈ వ్యూహంతో రాష్ట్రంలో మెజారిటీ పాల సేకరణ తనకే దక్కాలని, ఫలితంగా హెరిటేజ్ డెయిరీని మూసివేయించాలని కూడా జగన్ వర్గం పథకం రచించింది. అయితే జగన్ సర్కారు అనుకున్నంత ఈజీగా అమూల్ ను పాడి రైతులు నమ్మలేదు. అమూల్ లక్ష్యం రోజుకు 50 లక్షల లీటర్ల సేకరణ. అయితే ప్రస్తుతం నాలుగు చోట్ల అమూల్ కార్యకలాపాలు సాగిస్తుండగా… రోజుకు లక్ష లీటర్ల సేకరణ కూడా సాధ్యం కావడం లేదు.
దీంతో అమూల్ నిర్వాహకులు జగన్ కు పరిస్థితి వివరించగా… తాను ఏరికోరీ తీసుకొచ్చిన సంస్థ లక్ష్యం చేరకుంటే ఎలాగనుకున్నారో… ఏమో తెలియదు గానీ… జగన్ తన వర్గాన్ని నేరుగానే రంగంలోకి దించారు. పాడి రైతులు తమ పాలను అమూల్ కు పోయాలని, అలా కాని పక్షంలో ఆయా పాడి రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలన్నీ కట్ చేయిస్తామని నేరుగా చెప్పేయండని జగన్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
ఇదే విషయాన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వెలుగు పీడీలు క్షేత్రస్థాయికి చేరవేస్తున్నారు. ఈ క్రమంలో ఈ తరహా ఆదేశాలు బయటకు పొక్కితే… తమకు ఎంతమేర నష్టం జరుగుతున్నందన్న విషయం తెలిసినా… సర్కారీ పెద్దల ఆదేశాలను పక్కనపెట్టేయలేక ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ ఆదేశాలను చేరవేయక తప్పడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆదేశాలతో జగన్ తన నిజ రూపాన్ని బయటపెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.